కాంగ్రెస్, బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్
బీజేపీ ఎదుగుతోందనే కుట్రలు
కేంద్ర ప్రభుత్వ పథకాలను అడ్డుకోవడం దుర్మార్గం
రాష్ట్రంలో ‘డబుల్ ఇంజన్’ సర్కార్ రావాలని ప్రజల ఆకాంక్ష
కరీంనగర్ అభివృద్ధికి రూ. 22 వేల కోట్ల నిధుల మంజూరు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కాకతీయ,తెలంగాణ బ్యూరో / కరీంనగర్ : రాష్ట్రంలో బీజేపీ క్రమంగా బలపడుతుండటంతో ఓర్వలేక కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. శుక్రవారం కరీంనగర్‌లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను రాజకీయం చేస్తూ అడ్డుకోవడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం వెనుక కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అవగాహన ఉందని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ చాపకింద నీరులా ఎదుగుతుండటంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ రెండు పార్టీలు ‘బిగ్ బాస్’ తరహాలో డ్రామాలాడుతున్నాయని ఎద్దేవా చేశారు. సింగరేణిలో బొగ్గు మాయంపై విచారణ జరిపించే దమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, చేతకాకపోతే కేంద్రానికి అప్పగించాలని సవాల్ విసిరారు.
రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై విమర్శలు
సంక్షేమ పథకాలను కోర్టుకు తీసుకెళ్లి అడ్డుకోవాలనుకోవడం దారుణమని బండి సంజయ్ అన్నారు. పథకం అమలు భారమైతే ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలి తప్ప, ప్రజలకు మేలు చేసే పనులను ఆపడం సరికాదని సూచించారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఏకంగా 10 వేల స్కూళ్లను మూసివేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం మూర్ఖత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఎంపీగా ఎన్నికైనప్పటి నుండి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి రూ. 22 వేల కోట్లు తీసుకొచ్చానని మంత్రి తెలిపారు. ఇందులో రోడ్ల నిర్మాణం కోసమే రూ. 10 వేల కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. యూసీఎఫ్ నిధుల కింద మంజూరైన రూ. 840 కోట్లతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని, పార్కింగ్, డంపింగ్ యార్డు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో భాగంగా 37వ డివిజన్‌లో రూ. 77 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్లు, డ్రెయిన్ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు ఓపెన్ జిమ్‌ను ప్రారంభించారు.
- అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదు
రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు అవగాహనా రాహిత్యంతో కూడుకున్నవి. యూసీఎఫ్ నిధులు దేశవ్యాప్తంగా 17 ప్రాజెక్టులకు మాత్రమే వస్తే, అందులో కరీంనగర్ ఉండటం గర్వకారణం. కేంద్రం ఇస్తున్న నిధులతో నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. ప్రజల సంక్షేమం కోసం కేంద్రం తీసుకొస్తున్న పథకాలను అడ్డుకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు.

