నల్లబెల్లి పీఏసీఎస్ చైర్మన్‌గా ఎర్రబెల్లి రఘుపతి రావు
రాష్ట్రంలోనే తొలి నియామక ప్రక్రియకు శ్రీకారం
మిన్నంటిన కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
కాకతీయ, నల్లబెల్లి : నల్లబెల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) నామినేటెడ్ చైర్మన్‌గా రేలకుంట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి రఘుపతి రావు నియమితులయ్యారు. ఈ మేరకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధికారిక ఉత్తర్వులను, జీవో కాపీని అందజేశారు. రాష్ట్రంలోనే తొలిసారిగా పీఏసీఎస్ చైర్మన్‌ల నియామక ప్రక్రియ నల్లబెల్లి నుంచే ప్రారంభం కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అనుభవజ్ఞుడైన నాయకుడిని చైర్మన్‌గా నియమించడం వల్ల నల్లబెల్లి మండల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. సహకార సంఘం బలోపేతం, సకాలంలో పంట రుణాలు, ఎరువులు మరియు విత్తనాల సరఫరాలో పారదర్శకమైన పాలన అందిస్తారని వారు పేర్కొన్నారు. రైతుల సమస్యల పరిష్కారంలో ఈ సహకార సంఘం ఇకపై మరింత క్రియాశీలక పాత్ర పోషిస్తుందని వారు తెలిపారు.
నల్లబెల్లిలో సంబరాలు
నియామక వార్త తెలియగానే నల్లబెల్లి మండల కేంద్రంతో పాటు రేలకుంట గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. కార్యకర్తలు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని ఆనందాన్ని పంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాల్లో భాగంగానే ఈ నియామకాలు జరిగాయని నాయకులు వెల్లడించారు. నల్లబెల్లి పీఏసీఎస్‌ను ఆదర్శ సహకార సంఘంగా తీర్చిదిద్దేందుకు నూతన చైర్మన్ రఘుపతి రావు శక్తివంచన లేకుండా కృషి చేస్తారని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.

