రోడ్డు ప్రమాదం చేసి.. బాధితుడిపై దాడి
నిందితుడి అరెస్టు చేసిన గీసుగొండ పోలీసులు
కాకతీయ, గీసుగొండ: రోడ్డు ప్రమాదానికి కారణమై, ప్రమాదంపై ప్రశ్నించిన వ్యక్తిని తీవ్రంగా గాయపరిచిన ఘటనలో నిందితుడిని సోమవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మచ్చాపురం గ్రామానికి చెందిన బాల్తా బుచ్చిబాబు మే 21న రాత్రి ఇంటికి వెళ్తుండగా, అదే గ్రామానికి చెందిన కంబాల వెంకటేష్ అతివేగంగా ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ బాధితుడిని ఢీకొట్టాడు. ప్రమాదంపై నిలదీయగా, నిందితుడు వెంకటేష్ బాధితుడిని దూషించి, పిడిగుద్దులతో దాడి చేశాడు. అనంతరం రాయితో ఎడమ కాలి పాదంపై బలంగా కొట్టడంతో బుచ్చిబాబుకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు. సోమవారం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించిందని సీఐ తెలిపారు. చట్టాన్ని అతిక్రమించి దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

