వృద్ధురాలిపై అత్యాచారయత్నం..!
కాంగ్రెస్ కౌన్సిలర్ అరెస్టు!
కాకతీయ, జనగామ : జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్ గ్రామంలో ఓ వృద్ధురాలిపై కాంగ్రెస్ కౌన్సిలర్ అత్యాచారానికి యత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్టేషన్ ఘన్‌పూర్ మునిసిపాలిటీ పరిధిలోని 9వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ చౌదరపల్లి సంపత్ రాజ్ సోమవారం అర్ధరాత్రి సమయంలో ఓ ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న వృద్ధురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిద్రిస్తున్న వృద్ధురాలిపై సంపత్ రాజ్ అసభ్యంగా ప్రవర్తించడంతో, ఆమె గట్టిగా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అప్రమత్తమై అక్కడికి చేరుకున్నారు. వారిని గమనించిన సంపత్ రాజ్ తప్పించుకునేందుకు ఇంట్లోని బాత్రూంలోకి వెళ్లి దాక్కున్నాడు. వెంటనే స్థానికులు బాత్రూం బయట నుంచి గడియ పెట్టి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సంపత్ రాజ్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రజాప్రతినిధిగా ఉండి ఇలాంటి దారుణమైన చర్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనతో చాగల్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

