- ఆరోగ్యకరమైన కుటుంబానికి అదే మార్గం
- వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఐ. ప్రకాష్ పిలుపు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: పిల్లల మధ్య సరైన అంతరం పాటించడం వల్ల కుటుంబాలు ఆరోగ్యంగా, ఆర్థికంగా నిలదొక్కుకుంటాయని ఇన్చార్జి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఐ. ప్రకాష్ అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా జూలై 11 నుంచి 18 వరకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దంపతులకు అవసరమైన కౌన్సెలింగ్, ఉచిత కుటుంబ నియంత్రణ సేవలను అందుబాటులో ఉంచామన్నారు. కార్యక్రమంలో భాగంగా శనివారం కీర్తినగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్సీడీ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ సయ్యద్ ఇక్తాదార్ అహ్మద్ మాట్లాడుతూ, తల్లి-శిశు సంక్షేమం కోసం ప్రతి దంపతులు కాన్పుల మధ్య తగినంత విరామం పాటించాలని సూచించారు. దీనివల్ల ప్రసూతి మరణాలు తగ్గుతాయని, తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు.
ఉచితంగా అందుబాటులో ఉన్న సేవలు
ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఎలాంటి రుసుము లేకుండానే అనేక సేవలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ ఇక్తాదార్ అహ్మద్ వివరించారు. దంపతులు తమ అవసరాలకు అనుగుణంగా వైద్యుల సలహా మేరకు సరైన పద్ధతిని ఎంచుకోవాలని ఆయన సూచించారు. సందేహాలు ఉన్నవారు వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారి డాక్టర్ హుస్సేన్, గణాంక అధికారి ప్రసన్న, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, సీవో విఠల్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

