- ఏజెన్సీ వాసులకు 13 ఏళ్లుగా అందని ద్రాక్ష!
- రూ.2.10 కోట్లతో ప్రారంభమైన ప్రాజెక్టు
- పూర్తి చేయడంలో ప్రభుత్వం విఫలం
- కలుపు మొక్కలతో శిథిలావస్థలో క్రీడా ప్రాంగణం
- తక్షణమే పనులు పూర్తి చేయాలని గిరిజనుల డిమాండ్
కాకతీయ/కరకగూడెం : కరకగూడెం మండలంలోని భట్టుపల్లి గ్రామంలో క్రీడాకారుల కలల ప్రాజెక్టుగా ప్రారంభమైన మినీ స్టేడియం, 13 ఏళ్లు గడిచినా నేటికీ అసంపూర్తిగానే మిగిలిపోయింది. అట్టహాసంగా శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టు, నేడు నిర్లక్ష్యానికి గురై పొదలతో నిండిపోయి శిథిలావస్థకు చేరుకుంది. 2013 మార్చి 16న అప్పటి పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చేతుల మీదుగా రూ.2.10 కోట్ల వ్యయంతో ఈ గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లో మంత్రులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో జరిగిన శంకుస్థాపన వేడుకతో గ్రామస్తులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. కానీ, పనులు కొంత మేర మాత్రమే సాగి మధ్యలోనే ఆగిపోయాయి. నేడు స్టేడియం ప్రాంగణం కలుపు మొక్కలు, అడవి పొదలతో కప్పబడి, పాములు, విషపురుగులు తిరిగే అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది.
యువతలో తీవ్ర నిరాశ
భట్టుపల్లి మరియు చుట్టుపక్కల గ్రామాల యువతకు క్రీడల్లో శిక్షణ పొందేందుకు సరైన మైదానం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అథ్లెటిక్స్, కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ వంటి క్రీడల కోసం రోడ్లపై, పాఠశాల ఆవరణల్లో సాధన చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం క్రీడలకు ప్రోత్సాహం ఇస్తున్నామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో ఇలాంటి ప్రాజెక్టులు నిలిచిపోవడం పట్ల స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వాలు మారినా, అధికారులు మారినా ఈ ప్రాజెక్టు విషయంలో ఎవరూ స్పందించకపోవడంపై యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే నిర్మించిన భాగాలు కూడా నిర్వహణ లేక దెబ్బతింటున్నాయని, కోట్ల రూపాయల ప్రజాధనం ఇలా వృథా కావడం దారుణమని గ్రామ పెద్దలు విమర్శిస్తున్నారు. ఈ స్టేడియం పూర్తయితే కరకగూడెం మండల స్థాయి పోటీలకు ఇది కేంద్రంగా మారే అవకాశం ఉందని క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు.
తక్షణమే స్పందించాలని డిమాండ్
నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించి, అవసరమైన నిధులను విడుదల చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. యువత ఆరోగ్యవంతమైన జీవితానికి, క్రీడా ప్రతిభాభివృద్ధికి ఈ మినీ స్టేడియం ఎంతో అవసరమని, ఇకనైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని భట్టుపల్లి ప్రజలు, క్రీడాకారులు వేడుకుంటున్నారు.

