- ములుగు బీఆర్ఎస్‌లో అంతర్గత కల్లోలం
- జిల్లా నాయకత్వం, నియోజకవర్గ ఇన్‌చార్జ్ మధ్య సమన్వయ లోపం
- ప్రోటోకాల్ వివాదంతో సీనియర్లలో పెరుగుతున్న అసహనం
- ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వేళ పార్టీ శ్రేణుల్లో అయోమయం
- రాష్ట్ర నాయకత్వం స్పందన కోసం ఎదురుచూపులు

కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : ములుగు జిల్లా బీఆర్‌ఎస్‌లో అంతర్గత విభేదాలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌రావు, ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జ్ బడే నాగజ్యోతి మధ్య సమన్వయం లోపించిందనే ప్రచారం పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నాగజ్యోతి, ఇటీవల జిల్లా స్థాయి కీలక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఏటూరునాగారం కేంద్రంగా మొదలైన ఈ అసంతృప్తి, ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పార్టీ శ్రేణుల్లో ఐక్యత కంటే వర్గ ప్రాబల్యం పెరుగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రోటోకాల్ వివాదం.. సీనియర్ల అసహనం
పార్టీ కార్యక్రమాలు, ఆందోళనలు, మీడియా ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారంలో పాటించాల్సిన సంస్థాగత ప్రోటోకాల్‌ను కొందరు విస్మరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, దీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తల పేర్లను అధికారిక ప్రచారంలో ప్రస్తావించడం లేదని, ఫోటోలు, ప్రెస్ నోట్లలో కూడా గుర్తింపు ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ అంశాలపై వివరణ కోరిన వారికి మర్యాదపూర్వక స్పందన లభించడం లేదని, దీనివల్ల పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన వారు పక్కకు నెట్టబడుతున్నారనే భావన క్షేత్రస్థాయిలో బలపడుతోంది.
రాష్ట్ర నాయకత్వం మౌనం..
ఈ పరిణామాలపై పలువురు సీనియర్ నాయకులు జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌రావు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. గతంలోనే నాగజ్యోతి సోషల్ మీడియా బాధ్యులకు పార్టీ నిబంధనల గురించి సూచించినా, పరిస్థితిలో మార్పు రాలేదని సమాచారం. ఎన్నికల సమయంలో “అందరం ఒక్కటే” అని నినదించిన నాయకులు, ఎన్నికల తర్వాత సమన్వయ లోపంతో ఇబ్బందులు పడటం కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది.
స్థానిక ఎన్నికల వేళ హెచ్చరికలు
త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఈ అంతర్గత పరిణామాలు పార్టీ ఎన్నికల సన్నద్ధతపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు ఆందోళన చెందుతున్నారు. ఏటూరునాగారం వేదికగా మొదలైన ఈ అసంతృప్తి ఇతర మండలాలకు కూడా విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా నాయకత్వం చొరవ తీసుకుని, అన్ని వర్గాల నాయకులతో సమావేశమై అపోహలను తొలగించి, పార్టీని ఏకతాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి, స్థానిక ఎన్నికల సమయానికి జిల్లా నాయకత్వం ఈ విభేదాలను పరిష్కరిస్తుందా? లేక ఈ కల్లోలం రానున్న ఎన్నికలపై ప్రభావం చూపుతుందా? అన్నది ఏజెన్సీ ప్రాంత రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

