ఎస్సారెస్పీ భూముల కబ్జా
పంజా విసురుతున్న అక్రమార్కులు
ఎక్స్కవేటర్లతో యథేచ్ఛగా భూమిని చదును
అధికారుల హెచ్చరికలనూ లెక్కచేయని దుండగులు
నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వ భూమి ఆక్రమణలు
క్షేత్రస్థాయి పర్యవేక్షణలో ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం
ముడుపుల మత్తులో అధికారుల ఉదాసీనతపై అనుమానాలు
ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై స్థానికుల తీవ్ర ఆందోళన
కాకతీయ, శంకరపట్నం : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో ఎస్ఆర్ఎస్పీ (శ్రీరాంసాగర్ ప్రాజెక్టు) శాఖకు చెందిన విలువైన ప్రభుత్వ భూమిపై కబ్జాదారుల పంజా మళ్లీ మొదలైంది. అధికారుల హెచ్చరికలను సైతం ఏమాత్రం లెక్కచేయకుండా, భారీ యంత్రాలతో భూమిని చదును చేస్తుండటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలకు ఎవరు అండగా ఉంటున్నారనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కేశవపట్నం గ్రామంలోని ఎస్ఆర్ఎస్పీ భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించి జేసీబీలతో చదును చేస్తున్నట్లు స్థానికులు ఇచ్చిన సమాచారంతో, ప్రాజెక్టు ఏఈ పావని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆ భూమి పూర్తిగా ఎస్ఆర్ఎస్పీ పరిధిలోనిదేనని నిర్ధారించుకున్న ఏఈ, అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులను పిలిచి హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పనులు నిలిపివేయాలని స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన అధికారుల ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ, గురువారం కూడా లష్కర్ సిబ్బందిని అక్కడికి పంపినప్పటికీ, దుండగులు మళ్ళీ అదే భూమిలో జేసీబీలతో చదును పనులు చేపట్టడం అక్రమార్కుల దురుసుతనానికి నిదర్శనమని గ్రామస్తులు మండిపడుతున్నారు.
ముడుపుల మత్తులో అధికారులు? వ్యవస్థలో లోపాలు!
అధికారులు అక్రమాలను అరికట్టడంలో ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారా? లేక ముడుపుల మత్తులో అక్రమాలకు వత్తాసు పలుకుతున్నారా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపించడం వల్లే కబ్జాదారులు ఇంతటి ధైర్యంతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పలు పత్రికల్లో ఈ కబ్జా వ్యవహారంపై వరుస కథనాలు వస్తున్నా, అధికారులు నామమాత్రపు తనిఖీలతో కాలక్షేపం చేయడం వెనుక ఆంతర్యమేమిటో తెలియడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏఈ పావనిని వివరణ కోసం ఫోన్లో సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ స్పందన లేకపోవడం, అధికారుల పనితీరుపై మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది.
ప్రభుత్వ ఆస్తుల రక్షణకు చర్యలేవి?
ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత కలిగిన ఎస్ఆర్ఎస్పీ శాఖ, అక్రమ కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నా చూసీచూడనట్లు వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు ఇప్పటికైనా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని, క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కబ్జాదారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేలా తక్షణమే కంచె వేయడం వంటి చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు ఇలాగే మౌనం వహిస్తే, ప్రజలే స్వయంగా రంగంలోకి దిగి నిరసనలు చేపట్టాల్సి ఉంటుందని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.

