కాంగ్రెస్‌లో వర్గపోరుకు నిండు ప్రాణం బలి
కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు అడుప మహేష్ దారుణ హత్య
మహేష్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు
హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి
రాజకీయ కక్షతో కుట్ర.. మద్యం తాగించి దారుణం
పరారీలో నిందితులు.. పోలీసుల ప్రత్యేక గాలింపు
వర్ధన్నపేట నియోజకవర్గంలో ఆధిపత్య పోరు చిలికి చిలికి గాలివానలా
రౌడీ షీటర్ల హస్తంపై స్థానికంగా తీవ్ర చర్చ
కాకతీయ, వరంగల్ సిటీ /గీసుగొండ : వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అంతర్గత వర్గపోరు చివరకు ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని వరంగల్ నగర పద్నాలుగో డివిజన్ కాంగ్రెస్ నాయకుడు అడుప మహేష్ (45) పై శనివారం రాత్రి జరిగిన పెట్రోల్ దాడి విషాదాంతమైంది. తీవ్ర గాయాలతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహేష్‌ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా ఆదివారం మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ ఘటనతో కాంగ్రెస్‌లోని వర్గ రాజకీయాలు, నాయకుల మధ్య ఆధిపత్య పోరు మరోసారి బహిర్గతమైంది.

రాజకీయ కక్షతో కుట్ర.. మద్యం తాగించి దారుణం
పోలీసుల కథనం ప్రకారం, శనివారం రాత్రి జన్ను మధు ఫోన్ చేసి మాట్లాడాల్సిన పని ఉందంటూ గొర్రెకుంటలోని కోటిలింగాల దేవాలయం వద్దకు మహేష్‌ను పిలిపించాడు. తొలుత నిరాకరించినప్పటికీ, నమ్మించి అక్కడికి రప్పించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మహేష్‌కు మద్యం తాగించిన తర్వాత పత్తి కుమార్ అక్కడికి చేరుకుని, “వర్ధన్నపేట ఎమ్మెల్యే గారికి నా గురించి ఎందుకు చెడుగా చెబుతున్నావు.. నాకంటే నీకు భయం లేదా?” అంటూ వాగ్వాదానికి దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత ముందస్తు కుట్ర ప్రకారం మహేష్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు.
పరారీలో నిందితులు.. పోలీసుల ప్రత్యేక గాలింపు
మహేష్ భార్య అడుప నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు పత్తి కుమార్, జన్ను మధుతో పాటు మరికొందరిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అయితే, మహేష్ మృతి చెందడంతో ఈ కేసును హత్య కేసుగా మార్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రధాన నిందితుడు పత్తి కుమార్‌పై గతంలో హత్య కేసుతో పాటు పలు క్రిమినల్ కేసులు నమోదై, ఏనుమాముల పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీట్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉండగా, ప్రత్యేక బృందాలు వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.
రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ
వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న వర్గ విభేదాలే ఈ దారుణ ఘటనకు కారణమన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఒకే పార్టీకి చెందిన నాయకుల మధ్య నెలకొన్న వ్యక్తిగత కక్షలు, ఆధిపత్య పోరు చివరకు ఓ సీనియర్ కార్యకర్త ప్రాణాలను బలిగొనడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పార్టీలో క్రిమినల్ చరిత్ర ఉన్న వారికి చోటు కల్పించడం వల్లే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రౌడీ షీటర్ల పేరుతో ప్రజలను బెదిరించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పోలీసులు స్పష్టం చేశారు.

