ఆపరేషన్ సయోధ్య
బీజేపీ అధిష్ఠానం ఆదేశాలతో రంగంలోకి అభయ్
రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతో కలిసి వరుస భేటీలు
నేతల మధ్య ఉన్న అభిప్రాయ బేధాలను తొలగించేందుకు ప్రయత్నాలు
ఆలింగనంతో ఒక్కటైన ఈటల,బండి
హైకమాండ్ అడుగులతో మారిన సమీకరణాలు
ఎన్నికల రణరంగంలోకి మిషన్ తెలంగాణ
బీజేపీలో అంతర్గత విబేధాలకు ఫుల్ స్టాప్
కలిసికట్టుగా ముందుకు సాగాలని నిర్ణయం
కొత్త ఊపుతో కమలం పార్టీ నేతలు
కాకతీయ, తెలంగాణబ్యూరో : తెలంగాణ రాజకీయ యవనికపై కమలదళం కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. కొన్నాళ్లుగా ఉప్పు నిప్పులా ఉన్న బీజేపీ అగ్రనేతలు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ ఈటల రాజేందర్ ఎట్టకేలకు ఒక్కటయ్యారు. ఇకపై అందరం కలిసికట్టుగా నడవాలని నిర్ణయించుకున్నారు. అధిష్ఠానం రంగప్రవేశం ఆపరేషన్ సయోధ్య సక్సెస్ కావడంతో పార్టీ శ్రేణుల్లో మళ్ళీ కొత్త జోష్ మొదలైంది. రాష్ట్రంలో పార్టీ బలంగా ఉన్నా అగ్రనేతల మధ్య సమన్వయ లోపం అధికార మార్పునకు ఆటంకంగా మారుతోందని ఢిల్లీ పెద్దలు పసిగట్టారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రూపు రాజకీయాలు పార్టీ పుట్టి ముంచుతాయని భావించిన హైకమాండ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్‌ను రంగంలోకి దించింది. పార్టీలో ఎవరికి వారు అన్నట్టుగా సాగుతున్న వ్యవహారశైలిపై అధిష్ఠానం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలోనే ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ నివాసం వేదికగా జరిగిన ఈ భేటీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గెలుపు ముఖ్యం అని మన మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు పార్టీని దెబ్బతీస్తున్నాయని ఇకపై అంతా కలిసి పని చేయాల్సిందేనని అధిష్ఠానం పంపిన సందేశాన్ని అభయ్ పాటిల్ నిర్మొహమాటంగా తేల్చిచెప్పారు. దీంతో పార్టీ ప్రయోజనాల దృష్ట్యా గతాన్ని మరిచిపోవాలని ఇరువురు నేతలు అంగీకరించారు. నాకు ఎవరిపై వ్యక్తిగత ద్వేషం లేదు పార్టీ గెలుపే నా లక్ష్యం అని ఈటల రాజేందర్ స్పష్టం చేయగా పార్టీ నా తల్లి అధిష్ఠానం మాట జవదాటను తప్పుంటే సరిదిద్దుకుంటానని బండి సంజయ్ హామీ ఇచ్చారు. సమావేశం ముగిశాక ఇరువురు నేతలు ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం ఆ పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

ఐక్యతతోనే అధికార పీఠం సాధ్యం
ఈ సయోధ్య వల్ల బీజేపీకి రాజకీయంగా భారీ లాభాలు చేకూరనున్నాయి. రాష్ట్రంలో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయిందనే ప్రచారానికి చెక్ పడింది. దీనివల్ల క్యాడర్లో ఉన్న గందరగోళం తొలగి ఉత్సాహం పెరుగుతుంది. రాష్ట్రంలో బలమైన బీసీ సామాజిక వర్గాలకు చెందిన బండి సంజయ్ ఈటల రాజేందర్ కలిసి నడవడం వల్ల బీసీ ఓటు బ్యాంక్ బీజేపీ వైపు తిరగడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో ఆశించిన స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు చేయలేకపోయామనే లోటు ఇప్పుడు తీరనుంది. ఇకపై రేవంత్ ప్రభుత్వంపై మరింత దూకుడుగా సమన్వయంతో విమర్శలు చేసేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. ఒకే మాట ఒకే బాటగా మారిన కమలనాథులు ఇప్పుడు క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో రంగంలోకి దిగనున్నారు. గతంలో నేతల మధ్య ఉన్న గ్యాప్ వల్ల క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కూడా రెండుగా విడిపోయి ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది.
ఎన్నికలే లక్ష్యంగా సాగుతున్న కసరత్తు
రాబోయే ఎన్నికల కోసం బీజేపీ అధిష్ఠానం మిషన్ తెలంగాణకు శ్రీకారం చుట్టింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావుతో అభయ్ పాటిల్ నిర్వహించిన సమావేశం ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో భేటీ ద్వారా పార్టీని యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల నాటికి ఇతర పార్టీల నుంచి అసంతృప్త నేతలను భారీగా ఆహ్వానించేందుకు హైకమాండ్ పచ్చజెండా ఊపింది. జమిలి ఎన్నికల అస్త్రం నియోజకవర్గాల పెంపు మహిళా రిజర్వేషన్ల అమలు వంటి అంశాలతో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించడమే కాకుండా అధికార పార్టీని ఇరుకున పెట్టేలా బలమైన అజెండాతో ముందుకు సాగాలని కమలదళం నిర్ణయించింది. అభయ్ పాటిల్ వరుస భేటీలు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా కనిపిస్తున్నాయి. వచ్చే రోజుల్లో మరింత దూకుడుగా వ్యవహరించడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీకి తిరుగులేకుండా చేసుకోవాలని అధిష్ఠానం భావిస్తోంది. అంతర్గత కలహాల నుంచి బయటపడిన కమలం ఇప్పుడు ఎన్నికల సమరానికి సిద్ధమైంది. సయోధ్య కుదిరిన వేళ క్షేత్రస్థాయిలో పార్టీకి కొత్త శక్తి లభిస్తుందా లేక ఎన్నికల వేళ మళ్ళీ గ్రూపు రాజకీయాలు ముసురుకుంటాయా అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా అధిష్ఠానం వ్యూహంతో తెలంగాణ బీజేపీ ఇప్పుడు తగ్గేదే లేదనే దూకుడుతో ముందుకెళ్తోంది. రాజకీయ విశ్లేషకులు కూడా ఈ మార్పును గమనిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఈ సయోధ్య మొదటి మెట్టు అని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేతల మధ్య ఐక్యత ఒక్కటే పార్టీని విజయతీరాలకు చేరుస్తుందని అధిష్ఠానం నమ్ముతోంది. అందుకే ఈ సయోధ్యను సీరియస్‌గా అమలు చేస్తోంది. రానున్న రోజుల్లో మరెన్నో రాజకీయ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. పార్టీ శ్రేణులు కూడా ఇప్పుడు పూర్తిస్థాయిలో ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయాయి. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ సమన్వయంతో పనిచేయాలని నేతలు పిలుపునిచ్చారు. దీంతో తెలంగాణ రాజకీయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

