- రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్
- మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేత
కాకతీయ, ములుగు ప్రతినిధి: రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లర్లపై కొనసాగుతున్న విజిలెన్స్ దాడులను వెంటనే నిలిపివేసి, పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ములుగు జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ కోరారు. మంగళవారం జిల్లాలోని రైస్ మిల్లర్లు రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్కను కలిసి తమ సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాదం ప్రవీణ్ మాట్లాడుతూ, ప్రభుత్వం, రైతులకు మధ్య వారధిగా నిలుస్తూ సన్నబియ్యం పథకం విజయవంతానికి రైస్ మిల్లర్లు కృషి చేస్తున్నారని తెలిపారు. అయితే సన్నధాన్యం నుంచి ఆశించిన మేర అవుట్టర్న్ రాకపోవడంతో తీవ్ర ఆర్థిక నష్టాలు ఎదురవుతున్నాయని చెప్పారు.
మిల్లుల సామర్థ్యానికి మించి ధాన్యం కేటాయించడం, ప్రభుత్వం సకాలంలో బియ్యాన్ని ఎత్తిపోకపోవడంతో నిల్వ ధాన్యంలో సహజ తరుగుదల ఏర్పడుతోందని పేర్కొన్నారు. ఆ తరుగుదలను సాకుగా చూపుతూ కేసులు నమోదు చేయడం వల్ల పరిశ్రమ సంక్షోభంలోకి నెట్టబడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాల కోసం ఎన్ని ఇబ్బందులు వచ్చినా రైస్ మిల్లర్లు వెనుకడుగు వేయడం లేదని, అలాంటి పరిస్థితుల్లో వరుస విజిలెన్స్ దాడులు మరింత ఇబ్బందులు సృష్టిస్తున్నాయని బాదం ప్రవీణ్ అన్నారు. రైస్ మిల్లర్ల సమస్యను సానుకూలంగా స్వీకరించిన మంత్రి దనసరి అనసూయ సీతక్క, సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో రైస్ మిల్లర్ అసోసియేషన్ కార్యదర్శి సహోదరి రెడ్డి, కోశాధికారి ఎలగందుల మోహన్, జిల్లాలోని పలువురు రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.

