సైబర్ నేరాలపై విద్యార్థులను అప్రమత్తం చేయాలి
అవగాహన కల్పించడంలో ఉపాధ్యాయులదే కీలక బాధ్యత
వరంగల్ సీపీ ఎన్. శ్వేత
వరంగల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రత్యేక సదస్సు
కాకతీయ, హనుమకొండ : సైబర్ నేరాల నుంచి విద్యార్థులను రక్షించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత అన్నారు. ‘సురక్షా కా తిరంగా’ కార్యక్రమంలో భాగంగా బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్వహించిన సైబర్ అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. సైబర్ నేరగాళ్లు అత్యాశ, భయం, అత్యవసర పరిస్థితులను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని సీపీ తెలిపారు. గుర్తుతెలియని లింకులు, సందేశాలు, ఫొటోలపై క్లిక్ చేయవద్దని, వ్యక్తిగత వివరాలను సామాజిక మాధ్యమాల్లో విచక్షణారహితంగా పంచుకోవద్దని సూచించారు. విద్యార్థులకు చిన్న వయస్సు నుంచే ప్రైవేట్, పబ్లిక్ జీవితాల మధ్య తేడా, సోషల్ మీడియా వినియోగంపై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. సదస్సులో సైబర్ క్రైమ్ అధికారులు తాజా మోసాలపై వివరించగా, పోలీస్ జాగృతి కళాబృందం సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించింది. అనంతరం సైబర్ భద్రత పోస్టర్లను సీపీ ఆవిష్కరించి ఉపాధ్యాయులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీసీపీ దారా కవిత, విద్యాశాఖ అధికారులు, పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

