మీ సేవలో అడ్డదారి దందా..!
‘సైట్ పనిచేయడం లేదు’ అంటూ ముందుగా సాకులు
‘ప్రత్యేక రూట్’ పేరుతో తర్వాత వసూళ్ల బాగోతం
జనన ధ్రువీకరణ పత్రం నుంచి ఆధార్, రేషన్‌కార్డు వరకు
ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.10 వేల వరకు డిమాండ్
ఫోన్‌పేలో విడతల వారీగా డబ్బుల వసూలు
అధికారుల పర్యవేక్షణపై వెల్లువెత్తుతున్న అనుమానాలు
కాకతీయ, ఏటూరునాగారం : ప్రజలకు ప్రభుత్వ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించేందుకు ఏర్పాటు చేసిన మీ సేవ కేంద్రాలే కొందరికి అడ్డదారి వసూళ్లకు అడ్డాగా మారుతున్నాయనే ఆరోపణలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. నిబంధనల ప్రకారం నిర్ణీత రుసుముతో అందాల్సిన సర్టిఫికెట్ల విషయంలో ముందుగా సాంకేతిక సమస్యలను సాకుగా చూపించడం.. ‘సైట్ పనిచేయడం లేదు’, ‘సైట్ ఓపెన్ కావడం లేదు’, ‘ఇప్పట్లో సర్టిఫికెట్ రాదు’ అంటూ దరఖాస్తుదారులను తిప్పడం.. ఆ తర్వాత ‘మరో మార్గం ఉంది’, ‘ప్రత్యేకంగా చేయిస్తే త్వరగా వస్తుంది’ అంటూ ప్రత్యామ్నాయ రూట్ చూపించడం.. అందుకు వేల రూపాయలు వసూలు చేస్తున్నారనే సమాచారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జనన ధ్రువీకరణ పత్రం నుంచి ఆధార్ సవరణ, రేషన్‌కార్డులో పేర్ల నమోదు వరకు సేవల పేరుతో అదనపు వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.10 వేల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఫోన్‌పే ద్వారా విడతల వారీగా చెల్లింపులు తీసుకుంటున్న ఉదంతాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. సైట్ పనిచేయకపోతే ‘ప్రత్యేక రూట్’లో పని ఎలా జరుగుతోంది? ఆ మార్గం ఎవరిది? దాని వెనుక ఉన్న వ్యవస్థ ఏమిటన్న ప్రశ్నలు అధికారుల పర్యవేక్షణపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
ముందు సైట్ సాకు.. తర్వాత ప్రత్యేక రూట్
జనన ధ్రువీకరణ పత్రం కోసం మీ సేవ కేంద్రాలను ఆశ్రయించే దరఖాస్తుదారులకు తొలుత సాంకేతిక సమస్యలను చూపిస్తున్నారనే సమాచారం ఉంది. ‘సైట్ ఓపెన్ కావడం లేదు.. ఎప్పుడు పనిచేస్తుందో చెప్పలేం.. ఇప్పట్లో సర్టిఫికెట్ రావడం కష్టం’ అంటూ దరఖాస్తుదారులను వెనక్కి పంపుతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అదే నిర్వాహకులు ‘మరో మార్గంలో త్వరగా చేయించవచ్చు’ అంటూ కొత్త రూట్ చూపిస్తున్నట్లు సమాచారం. అయితే ఆ మార్గంలో సర్టిఫికెట్ పొందాలంటే ఖర్చు ఎక్కువవుతుందని చెబుతూ వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ‘సంబంధిత శాఖలో తమకు ప్రత్యేక మార్గం ఉంది’, ‘అక్కడి నుంచి త్వరగా చేయించవచ్చు’ అంటూ నమ్మబలికి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. సాధారణ ప్రక్రియలో నిర్ణీత రుసుముతో అందాల్సిన సేవకు ఈ అదనపు చెల్లింపుల అవసరం ఏమిటన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.
స్కాలర్‌షిప్ కోసం సర్టిఫికెట్.. ఫోన్‌పేలో రూ.6 వేలు
ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు వరంగల్ భీమారం సమీపంలోని ఓ కళాశాలలో డిప్లొమా చదువుతున్నాడు. స్కాలర్‌షిప్ కోసం జనన ధ్రువీకరణ పత్రం అవసరం కావడంతో స్థానికంగా ఓ మీ సేవ కేంద్రం నిర్వాహకుడిని సంప్రదించినట్లు సమాచారం. సైట్ పనిచేయడం లేదని, ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చెప్పలేమని మొదట చెప్పినట్లు తెలుస్తోంది. అయితే మరో మార్గంలో త్వరగా సర్టిఫికెట్ ఇప్పించేందుకు అవకాశం ఉందని, అందుకు ఖర్చు ఎక్కువవుతుందని చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో విడతల వారీగా ఫోన్‌పే ద్వారా ఒకసారి రూ.2 వేలు, మరోసారి రూ.4 వేలు చెల్లించినట్లు బాధితుల నుంచి తెలిసింది. జనన ధ్రువీకరణ పత్రం కోసం మొత్తం రూ.6 వేల వరకు చెల్లింపులు జరిగినట్లు సమాచారం. అనంతరం జనన ధ్రువీకరణ పత్రంలోని పుట్టిన తేదీకి, ఆధార్‌లో నమోదైన పుట్టిన తేదీకి తేడా ఉన్న విషయం బయటపడినట్లు తెలుస్తోంది. దీంతో ఆధార్‌లో సవరణ అవసరమైన పరిస్థితి ఏర్పడింది.
ఆధార్ సవరణకు మరో కేంద్రం.. మరో రూ.700
జనన ధ్రువీకరణ పత్రం వ్యవహారం తర్వాత పుట్టిన తేదీ తేడా కారణంగా ఆధార్ సవరణ అవసరం కావడంతో బాధితుడు మరో ఆధార్ కేంద్రం నిర్వాహకుడిని సంప్రదించినట్లు సమాచారం. అక్కడ ఆధార్ అప్‌డేట్ కోసం సుమారు రూ.700 తీసుకున్నట్లు బాధితుల నుంచి తెలిసింది. ఆధార్ సవరణకు సుమారు పది రోజుల సమయం పడుతుందని చెప్పినట్లు సమాచారం. ఒక ధ్రువీకరణ పత్రం కోసం ఒక కేంద్రంలో చెల్లింపులు చేసిన తర్వాత, దానిలో తలెత్తిన సమస్యను పరిష్కరించేందుకు మరో కేంద్రంలో అదనపు భారం పడిన పరిస్థితి ఏర్పడింది. ఈ రెండు కేంద్రాల్లో వాస్తవంగా నిర్ణయించిన అధికారిక రుసుము ఎంత? వసూలు చేసిన మొత్తం ఎంత? దరఖాస్తుదారులకు రసీదులు ఇచ్చారా? అన్నది అధికారుల విచారణలో తేలాల్సి ఉంది.
రేషన్‌కార్డుకూ ‘కొత్త రూట్’
రేషన్‌కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చే విషయంలోనూ ఇదే తరహా వ్యవహారం జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం రేషన్‌కార్డులో పేరు చేర్చడం సాధ్యం కాదని చెప్పడం.. ఆ తర్వాత ‘సంబంధిత శాఖ నుంచి నేరుగా పేరు యాడ్ చేయించే అవకాశం ఉంది’ అంటూ మరో మార్గాన్ని చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఒక్కో వ్యక్తి నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తున్నారనే సమాచారం వినిపిస్తోంది. ప్రభుత్వ విధానంలో సాధారణంగా జరిగే ప్రక్రియను సంక్లిష్టంగా చూపించి.. తమకు ఉన్న పరిచయాలు లేదా ప్రత్యేక మార్గాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం నిజమైతే ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవలను ప్రైవేట్ వసూళ్లకు మార్గంగా మార్చినట్లే అవుతుంది.
మీ సేవ.. ప్రజా సేవా? వసూళ్ల సేవా?
జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ సవరణ, రేషన్‌కార్డు సేవలు.. ప్రజల జీవితాలకు అత్యంత కీలకమైన ధ్రువీకరణ పత్రాలకు సంబంధించినవే. అలాంటి సేవలను సులభంగా అందించాల్సిన కేంద్రాల్లో ‘సైట్ పనిచేయడం లేదు’ అంటూ ముందుగా జాప్యం చేయడం.. ఆ తర్వాత ‘ప్రత్యేక రూట్’ చూపించడం.. త్వరగా పని పూర్తవుతుందని చెప్పడం.. అందుకు భారీ మొత్తాలు వసూలు చేయడం వంటి ఆరోపణలు ఇప్పుడు అధికార యంత్రాంగం దృష్టికి వెళ్లాల్సిన అవసరం ఉంది. సైట్ నిజంగానే పనిచేయకపోతే అధికారిక ప్రక్రియ ఎందుకు నిలిచిపోతోంది? అదే సమయంలో ‘ప్రత్యేక రూట్’లో పని ఎలా సాధ్యమవుతోంది? ఆ రూట్ ఎవరిది? దాని వెనుక ఎవరున్నారు? ప్రజల నుంచి వసూలవుతున్న డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? అన్న ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. జిల్లాలోని మీ సేవ, ఆధార్ కేంద్రాలపై సంబంధిత అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి.. ఒక్కో సేవకు నిర్ణయించిన అధికారిక రుసుము, దరఖాస్తుల సంఖ్య, సర్టిఫికెట్ల జారీ వివరాలు, దరఖాస్తుదారుల నుంచి తీసుకున్న మొత్తాలు, డిజిటల్ చెల్లింపుల వివరాలు, రసీదుల జారీ తదితర అంశాలను పరిశీలిస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవలు ‘ప్రత్యేక రూట్ల’ పేరుతో అడ్డదారి వసూళ్లకు మారకుండా అధికారులు కఠినంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది.

