గూడూరులో ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు
మంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి
మౌలిక వసతులు, సభా ప్రాంగణం, పార్కింగ్‌పై దృష్టి
హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలన
కాకతీయ, హనుమకొండ : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యటన సందర్భంగా లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, కాంగ్రెస్ నాయకులు సమన్వయంతో పనిచేయాలని హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి సూచించారు. గూడూరు గ్రామంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోమవారం హనుమకొండ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆదివారం హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వొడితెల ప్రణవ్‌తో కలిసి ఇనగాల వెంకట్రామ్ రెడ్డి కమలాపూర్ మండలంలో పర్యటించారు. గూడూరు, కమలాపూర్, మర్రిపల్లిగూడెం గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గూడూరు గ్రామంలో మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్న కార్యక్రమ స్థలాన్ని పరిశీలించి, అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు.

ఏర్పాట్లపై సమీక్ష
లబ్ధిదారులకు అవసరమైన మౌలిక వసతులు, లబ్ధిదారుల జాబితా, సభా ప్రాంగణం, పార్కింగ్ తదితర అంశాలను పరిశీలించారు. మంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని, అధికారులు, స్థానిక నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఇనగాల వెంకట్రామ్ రెడ్డి సూచించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమలాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

