ఆదివాసీలే ప్రకృతికి అసలైన రక్షకులు
అడవులు, సహజ వనరుల పరిరక్షణలో కీలక పాత్ర
నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం లక్ష్మీరామానంద్
కాకతీయ, నర్సంపేట టౌన్ : అడవి, ప్రకృతి, మట్టి పరిమళాలను కాపాడుతూ పర్యావరణ పరిరక్షణలో ఆదివాసీలు కీలక పాత్ర పోషిస్తున్నారని నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం లక్ష్మీరామానంద్ అన్నారు. ప్రకృతిని తల్లిగా భావించి తరతరాలుగా అడవులు, కొండలు, నదులు, సహజ వనరులను సంరక్షిస్తున్న ఆదివాసీలు ప్రకృతికి అసలైన రక్షకులని పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా నర్సంపేటలో నిర్వహించిన ర్యాలీలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, జీవన విధానం దేశానికి అమూల్యమైన వారసత్వమని అన్నారు. ఆదివాసీల హక్కులు, అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రకృతిని కాపాడుతున్న ఆదివాసీ సోదర, సోదరీమణులకు ప్రపంచ ఆదివాసుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వారి అభ్యున్నతికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు.
కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు పెండెం రామానంద్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పంబి వంశీకృష్ణ, మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకూబ్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ కాటా ప్రభాకర్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొంత రంజిత్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ములకల మనీష్, కాంగ్రెస్ యువ నాయకులు మెరుగు కిరణ్, గోక వేదప్రకాష్, షాలుమ్, కాటా అఖిల్, చీకటి శివమణి, ఆదివాసీలు తదితరులు పాల్గొన్నారు.

