పేదల సొంతింటి కలను సాకారం చేస్తాం
అర్హులకు దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు
ఇప్పటి వరకు 8 లక్షల ఇళ్లు మంజూరు చేశాం
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
అనర్హుల తేలితే కేటాయింపులు రద్దు : కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
కాకతీయ, వరంగల్ బ్యూరో : అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటిని అందించి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పేదల సంక్షేమం విషయంలో ప్రభుత్వం వెనుకడుగు వేయదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో సంక్షేమ పథకాలను పేదల గుమ్మం వద్దకే చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సొంతిల్లు ప్రతి పేద కుటుంబం ఆత్మగౌరవానికి ప్రతీక అని మంత్రి అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మొదటి దశలో 4.5 లక్షలు, రెండో దశలో 2.5 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, హైదరాబాద్‌తో కలిపి ఇప్పటివరకు 8 లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. రానున్న మూడో, నాలుగో దశల్లోనూ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35 వేల అసంపూర్తి ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందిస్తున్నామని పేర్కొన్నారు. కులం, మతం, పార్టీ చూడకుండా అర్హతే ప్రామాణికంగా ఇళ్లను కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు.
రూ.5 లక్షల ఆర్థిక సాయం
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థికసాయాన్ని దశలవారీగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోందని మంత్రి తెలిపారు. ఇంటి నిర్మాణ దశను పరిశీలించి తదుపరి విడత నిధులు విడుదల చేస్తామని చెప్పారు. కాంట్రాక్టర్ల ప్రమేయం లేకుండా నిధులు నేరుగా లబ్ధిదారులకు చేరేలా చర్యలు చేపట్టామని వివరించారు. కాలనీల్లో తాగునీరు, రహదారులు, విద్యుత్ తదితర మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ఎజెండా అన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ కమలాపూర్ మండలంలో 394 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను అర్హులైన పేద కుటుంబాలకు అందించడం సంతోషకరమన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిశీలించి 394 కుటుంబాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. తప్పుడు సమాచారం ద్వారా అనర్హులు ఎంపికైనట్లు తేలితే కేటాయింపులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. లబ్ధిదారులు వారం రోజుల్లో ఇళ్లను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీ, ప్రజాప్రతినిధులు, అధికారులు, సర్పంచులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

