రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను రద్దు చేయాలి
కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం రాస్తారోకో
కాకతీయ, చేర్యాల : దేశ సంపదను ప్రైవేటీకరణ పేరుతో కార్పొరేట్లకు అప్పగించే విధానాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట మావో డిమాండ్ చేశారు. చేర్యాల పాత బస్టాండ్ కూడలిలో సోమవారం కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేసి కార్మికులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు కల్పించాలని కోరారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, విద్య, వైద్యం, ఉపాధి రంగాలను ప్రభుత్వ ఆధీనంలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్లను తొలగించి పేదలు, మధ్యతరగతి ప్రజలు, రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగించాలని కోరారు. ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచి కూలీలకు రోజుకు రూ.800 వేతనం, ఏడాదికి 200 రోజుల పని కల్పించాలని వెంకట మావో డిమాండ్ చేశారు. కార్పొరేట్ అనుకూల, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను కేంద్రం ఉపసంహరించుకోకపోతే రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇబ్రహీం, బండకింది అరుణ్‌కుమార్, ఆముదాల నర్సిరెడ్డి, పోలోజు శ్రీహరి, బోయిని మల్లేశం, ముస్త్యాల ప్రభాకర్, నంగి మైసయ్య, ఆముదాల రంజిత్‌రెడ్డి, మోకు దేవేందర్‌రెడ్డి, నాగపురి కనకయ్య, జిడాల చంద్రయ్య, రేపాక కుమార్, గుండ్ర రవీందర్, పాల వెంకటేశం, పడిదం వీరమని, సౌభాగ్య, వెంకటలక్ష్మి, కనకలక్ష్మి, రజిత, సుశీల తదితరులు పాల్గొన్నారు.

