కేయూపై సర్కారుది చిన్నచూపేనా?
ఓయూకు రూ.1,000 కోట్లు.. కేయూకు పైసా విదల్చరా?
ఉత్తర తెలంగాణకు విద్యా దిక్సూచి.. నిధుల విషయంలో మాత్రం నిర్లక్ష్యమా?
ఎన్నికల వేళ కేయూపై గొంతెత్తిన కాంగ్రెస్ నేతలు.. అధికారంలోకి వచ్చాక మౌనమేలా?
గోల్డెన్ జూబ్లీ వేళ ‘కుర్తా’ డిమాండ్‌పై మొదలైన చర్చ
అభివృద్ధికి నిధులివ్వకుండా వర్సిటీని ఎలా బలోపేతం చేస్తారంటూ ప్రశ్నలు?
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఉత్తర తెలంగాణ విద్యా, సామాజిక ప్రగతిలో కీలక పాత్ర పోషించిన కాకతీయ విశ్వవిద్యాలయం పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ.1,000 కోట్ల భారీ నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో రెండో అతిపెద్ద యూనివర్సిటీగా ఉన్న కాకతీయ యూనివర్సిటీకి నిధులివ్వకుండా మొండి చేయి చూపుతుండటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. యాభై ఏళ్లుగా ఉత్తర తెలంగాణకు ఉన్నత విద్యను అందిస్తూ.. వేలాది మంది విద్యావంతులు, మేధావులు, ప్రజా సమస్యలపై ప్రశ్నించే గళాలను తీర్చిదిద్దిన వర్సిటీకి నిధుల విషయంలో ఎందుకీ చిన్నచూపు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గత ప్రభుత్వంపై ఎన్నికల సమయంలో విద్యారంగం, విశ్వవిద్యాలయాల పరిస్థితిపై తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేయూ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించకపోవడంపై విద్యావర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కేయూ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ టీచర్ల అసోసియేషన్(కుర్తా) లేవనెత్తిన ఈ డిమాండ్ ఇప్పుడు సర్కారు వైఖరిపైనే చర్చకు దారితీస్తోంది. కేయూ అంటే కేవలం వరంగల్‌లోని ఓ విశ్వవిద్యాలయం కాదు. ఉత్తర తెలంగాణలో విద్యా చైతన్యానికి కేంద్రంగా ఎదిగిన సంస్థ. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం చూపింది. అనేక మంది మేధావులను, అధ్యాపకులను, పరిశోధకులను, వివిధ రంగాల్లో రాణించిన ప్రతిభావంతులను అందించింది. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గళాలకు వేదికగా నిలిచింది. అలాంటి వర్సిటీకి నిధులు కేటాయించడంలో ప్రభుత్వం వెనుకంజ వేయడంపై సహజంగానే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఓయూకు రూ.1,000 కోట్లు.. కేయూకు ఎందుకు ఇవ్వరు..?
ఉస్మానియా విశ్వవిద్యాలయం అభివృద్ధికి రూ.1,000 కోట్ల మేర నిధులు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయం చర్చకు వచ్చిన నేపథ్యంలోనే కేయూ విషయంలోనూ ఇదే తరహా ప్రత్యేక కేటాయింపులు చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఓయూకు భారీ నిధులు ఇవ్వడం అభినందనీయమే.. మరి కేయూకు కూడా అదే స్థాయిలో ప్రాధాన్యం ఎందుకు ఇవ్వకూడదు? అన్న ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. కేయూలో మౌలిక వసతుల అభివృద్ధి, విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు, పరిశోధనకు అనువైన వాతావరణం, ప్రయోగశాలల ఆధునికీకరణ వంటి అనేక అంశాలకు నిధులు అవసరమవుతున్నాయి. సాధారణ బడ్జెట్ కేటాయింపులతోనే అన్నింటినీ నెట్టుకురావడం సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గోల్డెన్ జూబ్లీ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలన్న డిమాండ్ బలపడుతోంది.
ఎన్నికల వేళ ప్రశ్నలు.. ఇప్పుడు సమాధానాలెక్కడ?
గత ప్రభుత్వ పాలనలో విద్యారంగం నిర్లక్ష్యానికి గురైందని కాంగ్రెస్ నేతలు ఎన్నికల సమయంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. విశ్వవిద్యాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించడంలో అప్పటి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా అప్పట్లో ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారుతుందని ఆశించిన కేయూ వర్గాలకు ఇప్పుడు ఎదురవుతున్నది ఏమిటి? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఎన్నికల సమయంలో కేయూ సమస్యలను ప్రస్తావించిన నాయకత్వం.. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే వర్సిటీకి నిధుల విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తోందన్న చర్చ సాగుతోంది. రాజకీయ విమర్శలు చేయడం ఒకటైతే.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఆచరణలో చూపించడం మరో విషయం. కేయూ విషయంలోనూ అదే పరీక్ష ఇప్పుడు ప్రభుత్వానికి ఎదురైంది. గత ప్రభుత్వంపై చేసిన విమర్శలకు భిన్నంగా కాకుండా.. విశ్వవిద్యాలయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రభుత్వం నిరూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఉత్తర తెలంగాణకు కేయూ చేసిన సేవ తక్కువేమీ కాదు
కాకతీయ విశ్వవిద్యాలయం ఐదు దశాబ్దాల ప్రస్థానంలో ఉత్తర తెలంగాణ విద్యా ముఖచిత్రాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్నత విద్యా అవకాశాలు కేంద్రీకృతమైన కాలంలో.. వరంగల్‌లో విశ్వవిద్యాలయం ఏర్పాటవడం ఈ ప్రాంత విద్యార్థులకు గొప్ప అవకాశంగా మారింది. వేలాది కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు కేయూలో చదువుకుని వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలతోపాటు పరిశోధన, బోధన, రాజకీయ, సామాజిక రంగాల్లోనూ తమదైన ముద్ర వేశారు. విద్యార్థుల్లో సామాజిక చైతన్యాన్ని పెంపొందించడంలోనూ వర్సిటీ పాత్ర కీలకంగా నిలిచింది. అలాంటి సంస్థకు యాభై ఏళ్ల వేడుకల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చే సందేశం ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గోల్డెన్ జూబ్లీకి ఘనంగా వేడుకలు నిర్వహించడం మాత్రమేనా? లేక భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా నిధులు కేటాయించి వర్సిటీని బలోపేతం చేయడమా? అన్నదే అసలు ప్రశ్న.
‘కుర్తా’ డిమాండ్‌లో తప్పేముంది?
కేయూకు ప్రత్యేక నిధులు కేటాయించాలన్న డిమాండ్‌ను కేవలం రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓయూకు భారీ నిధులు ఇచ్చే సమయంలో కేయూకు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరడం సహజమైన డిమాండ్‌గానే విద్యావర్గాలు పేర్కొంటున్నాయి. ఉత్తర తెలంగాణకు విద్యా కేంద్రంగా ఉన్న వర్సిటీని అభివృద్ధి చేయడానికి నిధులు అడగడం తప్పా? అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఒకవైపు రాష్ట్రంలోని ఇతర ప్రముఖ విశ్వవిద్యాలయాలకు భారీగా నిధులు కేటాయిస్తూ.. మరోవైపు కేయూకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వకపోతే ప్రాంతీయ అసమానతల ఆరోపణలకు అవకాశం కల్పించినట్లవుతుందన్న అభిప్రాయం ఉంది. కేయూకు ఎంత నిధులు అవసరం? ఏయే పనులు చేపట్టాలి? ఎన్ని సంవత్సరాల్లో పూర్తి చేయాలి? అనే అంశాలపై సమగ్ర ప్రణాళిక రూపొందించి ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని విద్యార్థులు, అధ్యాపకులు కోరుతున్నారు. యాభై ఏళ్ల చరిత్ర ఉన్న కేయూకు గోల్డెన్ జూబ్లీ కానుకగా నిధుల ప్యాకేజీ ఇస్తారా? లేక వేడుకలకే పరిమితం చేస్తారా? అన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఎన్నికల సమయంలో కేయూ ప్రాధాన్యాన్ని గుర్తించిన కాంగ్రెస్ నాయకత్వం.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలకు ఆచరణ రూపం ఇస్తుందా? ఓయూకు రూ.1,000 కోట్లు ఇచ్చే ప్రభుత్వానికి కేయూ విషయంలో నిధుల కొరతేనా.. లేక చిన్నచూపేనా? అన్న ప్రశ్నకు సర్కారు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.

