బీడీ కార్మికుల పెన్షన్లపై బీఆర్‌ఎస్ ఆందోళన
మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పెన్షన్లు మంజూరు చేయాలి
అర్హులైన వృద్ధాప్య బీడీ కార్మికులకు వెంటనే చేయూత అందించాలి
స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం: మరుపల్ల రవి
రెండో విడతకు కృషి.. కొత్త దరఖాస్తులకు సైట్ ఓపెన్ చేస్తాం : కమిషనర్ వెంకన్న
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పథకంలో అర్హులైన వృద్ధాప్య బీడీ కార్మికులకు వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు సోమవారం వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయం కౌన్సిల్ హాల్ ఎదుట ధర్నా నిర్వహించారు. 40వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో లబ్ధిదారులు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు మంజూరు చేయాలని, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలని నినాదాలు చేశారు.ఈ సందర్భంగా మరుపల్ల రవి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని, నిరుపేదలకు పెన్షన్లు అందించడంపై మాత్రం దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. సుమారు మూడేళ్ల క్రితం వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత, బీడీ కార్మికులు తదితర అర్హులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అప్పటి అధికారులు దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్నవాటిని ఆమోదించినప్పటికీ ఇప్పటివరకు పెన్షన్లు మంజూరు చేయలేదని ఆరోపించారు. ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్న వారిని మళ్లీ దరఖాస్తులు చేసుకునేలా చేయడం ద్వారా ప్రభుత్వం లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు.
అన్ని వర్గాలకూ పెన్షన్లు ఇవ్వాలి
అర్హత ఉన్న బీడీ కార్మికులతో పాటు వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులకు పెండింగ్‌లో ఉన్న పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని మరుపల్ల రవి డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ నాయకుల ఆందోళన విషయం తెలుసుకున్న జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న గ్రీవెన్స్ సెల్ నుంచి బయటకు వచ్చి ఆందోళనకారుల నుంచి వినతిపత్రాన్ని స్వీకరించారు. పెన్షన్ల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రెండో విడత పెన్షన్ల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే కొత్తగా అర్హత పొందిన వారు దరఖాస్తు చేసుకునేందుకు సైట్ ఓపెన్ చేయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం మట్టవాడ ఎస్సై సాంబయ్య ఆందోళనకారులతో మాట్లాడి శాంతింపజేయడంతో వారు ధర్నాను విరమించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు వనం కుమార్, మరుపల్ల గౌతం, పోలేపాక రాజన్, బాబు, అన్న శ్రీనివాస్, ఆవునూరు మల్లేశం, మంద బాబు, రాయబారపు కిషన్, పినగాని నాగేశ్వరరావు, వెంగళ సదానందం, కోరె సరోజన, కెంచ లక్ష్మి, వెంగళ శకుంతల, ఆకుతోట విజయ తదితరులు పాల్గొన్నారు.

