ఆగస్టు 18, 19 తేదీల్లో గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె
సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్త ఆందోళన
కాకతీయ, కారేపల్లి : గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18, 19 తేదీల్లో నిర్వహించే రాష్ట్రవ్యాప్త సమ్మెలో పాల్గొంటామని కార్మికులు తెలిపారు. ఈ మేరకు సోమవారం సింగరేణి మండల ఎంపీవోకు వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ సింగరేణి మండల కన్వీనర్ కే. నరేంద్ర మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని, రెండో పీఆర్సీలో చేర్చాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 51ను సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కారోబార్, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని కోరారు. సీఎం హామీ మేరకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని, ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమ్మెలో కార్మికులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) మండల కార్యదర్శి ఎస్. నాగేశ్వరరావు, బోళ్ల కొమరయ్య, పాలిక తిరపయ్య, యాదగిరి, ఉపేందర్, అచ్చయ్య, ఆధర్ల శ్రీను, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

