ప్రజల సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపాలి
గ్రీవెన్స్‌కు వచ్చిన ప్రతి దరఖాస్తుపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలి
అత్యవసర సమస్యలపై తక్షణమే స్పందించాలి
అర్హులైన వారికి పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలి : మంత్రి సీతక్క ఆదేశం
కాకతీయ, ఏటూరునాగారం : ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రాలు, హైదరాబాద్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మండల స్థాయిలోనే గ్రీవెన్స్ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి పరిష్కారం చూపాలని రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. సోమవారం గోవిందరావుపేట మండల కేంద్రంలో నిర్వహించిన మండల ప్రజావాణి కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణికి వచ్చిన ప్రతి దరఖాస్తుపై అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని మంత్రి సూచించారు. ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన సేవలు అందించాలని ఆదేశించారు. అత్యవసర సమస్యలపై తక్షణమే స్పందించడంతో పాటు నిర్ణీత సమయంలో పరిష్కారం చూపాలని, దరఖాస్తుదారులకు సమస్య పరిష్కార పురోగతిని తెలియజేయాలని సూచించారు. మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ
ఒంటరి మహిళలు, వితంతువులు, వికలాంగుల పింఛన్ దరఖాస్తులను ఈ నెల 31లోగా స్వీకరించాలని మంత్రి ఆదేశించారు. అర్హులైన గీత కార్మికులు, నేత కార్మికులు, తలసేమియా బాధితులకు పింఛన్లు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా మారుమూల గ్రామాలు, గూడేల్లో పర్యటించి ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని సీతక్క సూచించారు. పస్రా, గోవిందరావుపేట, చల్వాయి ప్రాంతాల్లో రహదారులు, గిరిజన తండాలు, గూడేల్లో మౌలిక వసతుల అభివృద్ధికి సుమారు రూ.50 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, తహసీల్దార్ సృజన్‌కుమార్, ఎంపీడీవో వరుణ్‌కుమార్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

