మొండి వైఖరి వీడండి.. రైతులకు నీళ్లివ్వండి
ఎస్సారెస్పీ నీళ్లు విడుదల చేసే వరకు శ్రమించేది లేదు
రైతాంగాన్ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం
ఎండిపోతున్న పంటలను చూసి ఊరుకోం
పోరాటం ఉధృతం చేస్తాం
:మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
కాకతీయ, రాయపర్తి : ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరిని వీడి ఎండిపోతున్న పంట పొలాలకు సాగునీటిని తక్షణమే విడుదల చేయాలని బీఆర్‌ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ సోమవారం మైలారం విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్ నుంచి మడూర్ కెనాల్ వరకు కాలువ వెంట ఆయన భారీ పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో పెద్ద సంఖ్యలో రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొని గులాబీ జెండాలు చేతబూని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతం గులాబీమయంగా మారింది. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని అన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. పంటలు చేతికొచ్చే సమయంలో నీరు అందక రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందించకుండా, విద్యుత్ కోతలతో మరింత ఇబ్బందులకు గురిచేస్తూ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఎస్సారెస్పీ నుంచి సాగునీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు.

నీళ్లు విడుదల చేసే వరకు పోరాటం
ఎండిపోతున్న పంటలను చూస్తూ తాము ఊరుకునేది లేదని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సాగునీటిని విడుదల చేయాలని కోరారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. నీటిని విడుదల చేయకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని ఆపేది లేదని రైతులు కూడా స్పష్టం చేశారు. పాదయాత్రలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాసరెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు మూనావత్ నరసింహా నాయక్, మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ రంగు కుమార్, పార్టీ కార్యకర్తలు, రైతులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

