వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా
రిజర్వేషన్లు మారితే నా సతీమణిని పోటీకి నిలుపుతా
అధిష్ఠానం ఆదేశిస్తే మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగుతా
ఏదైనా పార్టీ నిర్ణయమే శిరోధార్యంగా భావిస్తా
గ్రేటర్లో గెలవబోయేది కాంగ్రెస్సే.. 46 నుంచి 48 డివిజన్లు గెలుస్తాం
పదేళ్లలో పరకాలలో పార్టీని సున్నా నుంచి విజయం వరకు తీసుకొచ్చాం
ప్రజా, సామాజిక సేవతోలనే నాకు సంతృప్తి
పార్టీ కార్యకర్తలే నా బలం.. వారే నా సైన్యం
దసరా నుంచి కొత్త కార్యాచరణ అమలు చేస్తాం
ఎన్టీఆర్‌కు వీరాభిమానాని..ముందు ఎస్ఎఫ్ఐలో పనిచేశా
ఈ దేశానికి కాంగ్రెస్ ఎంతో అవసరం..
డీసీసీ అధ్యక్షుడిగా ఎంపికవ్వడానికి క్లీన్ అండ్ మెరిటే కారణం
నా విజన్ చూసి.. రాహుల్ గాంధీ హగ్ ఇచ్చారు
హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డి
కాకతీయ, తెలంగాణ బ్యూరో : రెండుసార్లు పార్టీ కోసం పరకాల అసెంబ్లీ ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నా.. ఈసారి మాత్రం ఖచ్చితంగా అధిష్ఠానం తనకు అవకాశం కల్పిస్తుందన్న విశ్వాసం ఉందని హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. డీలిమిటేషన్లో రిజర్వేషన్లు మారి తనకు అవకాశం లేకపోతే తన సతీమణిని బరిలోకి దింపుతానని ప్రకటించారు. అధిష్ఠానం ఆదేశిస్తే గ్రేటర్ వరంగల్ మేయర్ అభ్యర్థిగానూ పోటీ చేస్తానని, పార్టీ ఏ బాధ్యత అప్పగించినా శిరసావహిస్తానని చెప్పారు. పదవుల కోసం కాకుండా పార్టీ, ప్రజల కోసం పనిచేయడమే తన లక్ష్యమన్నారు. గ్రేటర్ వరంగల్‌లో కాంగ్రెస్ 46 నుంచి 48 డివిజన్లు గెలుచుకునే పరిస్థితి ఉందని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్ల పాటు పరకాలలో పార్టీని సున్నా నుంచి గెలుపు స్థాయికి తీసుకువచ్చామని, పార్టీ కార్యకర్తలే తన బలమని, వారే తన సైన్యమని తెలిపారు. హనుమకొండలోని తన నివాసంలో మంగళవారం డిజిటల్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఇనుగాల తన రాజకీయ ప్రస్థానం, వ్యక్తిగత నేపథ్యం, సేవా కార్యక్రమాలు, పరకాలలో కాంగ్రెస్ బలోపేతం, డీసీసీ అధ్యక్షుడిగా చేపడుతున్న కార్యక్రమాలు, భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై మాట్లాడారు.

ఎన్టీఆర్‌కు వీరాభిమాని.. ఎస్ఎఫ్ఐతో రాజకీయ ప్రస్థానం
చిన్ననాటి నుంచే తనకు రాజకీయాలపై ఆసక్తి ఉండేదని ఇనుగాల తెలిపారు. ఎన్టీఆర్‌కు వీరాభిమానిగా ఉండేవాడినని, ఆయనను చూసేందుకు స్కూల్ హాస్టల్ కాంపౌండ్ వాల్ దూకి వెళ్లినందుకు టీసీ ఇచ్చిన ఘటనను గుర్తుచేసుకున్నారు. 1985లో ఎస్ఎఫ్ఐలో విద్యార్థి ఉద్యమంతో రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందన్నారు. 2010లో కాంగ్రెస్‌లో చేరి 2012 నుంచి క్రియాశీలంగా పనిచేస్తున్నానని తెలిపారు. తమ కుటుంబానికి మొదటి నుంచీ కాంగ్రెస్‌తో అనుబంధం ఉందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టి.చంద్రశేఖర్‌రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారని చెప్పారు. తమ కుటుంబానికి ఒకప్పుడు నాలుగు వేల ఎకరాల భూమి ఉండేదని, అందులో మొత్తం దానం చేశామని తెలిపారు. ప్రస్తుతం ఆత్మకూరులో ఇల్లు తప్ప పెద్దగా ఆస్తులు లేవన్నారు. మామునూరు విమానాశ్రయం ఉన్న స్థలం తమ కుటుంబానికి చెందినదేనని, తమ తాతల కాలంలో ఎకరాకు రూపాయి చొప్పున విక్రయించారని వెల్లడించారు.
పరకాలలో పదేళ్ల పోరాటం.. సున్నా నుంచి విజయానికి
పరకాలలో కాంగ్రెస్‌ను సున్నా నుంచి గెలుపు స్థాయికి తీసుకురావడమే తన రాజకీయ ప్రస్థానంలో కీలక ఘట్టమని ఇనుగాల చెప్పారు. 2014లో తొలిసారి పరకాల నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశానని, ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉండటంతో ఎన్నికలు త్రిముఖ పోరుగా సాగాయని గుర్తుచేశారు. ఓటమి ఎదురైనా వెనుకడుగు వేయకుండా పార్టీని బలోపేతం చేశానన్నారు. కొండా సురేఖ పార్టీ మారిన తర్వాత పరకాల బాధ్యతలు తనకు అప్పగించారని, ఆ తర్వాత దాదాపు పదేళ్లపాటు కార్యకర్తలకు అండగా నిలిచి గ్రామగ్రామాన తిరిగానని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించామని, ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు వచ్చిన సుమారు ఐదు వేల ఓట్ల నుంచి 2023లో పార్టీ గెలిచే స్థాయికి తీసుకువచ్చామని చెప్పారు. 2018, 2023 ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేయాలని ఆశించినప్పటికీ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి రెండుసార్లు అభ్యర్థిత్వం నుంచి తప్పుకున్నానన్నారు. పార్టీ కోసం విధేయుడిగా ఉన్నందుకే ఈసారి అవకాశం వస్తుందన్న నమ్మకం ఉందని చెప్పారు. ‘‘రెండుసార్లు వద్దన్న పార్టీ.. మూడోసారి కూడా వద్దనదనే నమ్మకం ఉంది. ఈసారి పరకాల నుంచి నా పేరు కచ్చితంగా ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. టికెట్లు ఇచ్చే అంశాలు వాస్తవానికి అప్పటి పరిస్థితులు, సమీకరణాలపైనే ఆధారపడుతాయని అన్నారు. కాంగ్రెస్‌లో టికెట్లను డిసైడ్ చేసేది అధిష్ఠానమేనని అన్నారు.
డీలిమిటేషన్.. రిజర్వేషన్లు మారితే సతీమణి
డీలిమిటేషన్ కారణంగా నియోజకవర్గ రిజర్వేషన్లు మారి తనకు పోటీ చేసే అవకాశం లేకపోతే సతీమణిని రాజకీయ బరిలోకి దింపుతానని ఇనుగాల తెలిపారు. పార్టీ నిర్ణయం ఏదైనా తనకు శిరోధార్యమేనన్నారు. అధిష్ఠానం ఎమ్మెల్యేగా పోటీ చేయమంటే ఎమ్మెల్యేగా, మరో బాధ్యత అప్పగిస్తే దానిని స్వీకరించి పనిచేస్తానని చెప్పారు. మేయర్ పదవిపై తనకు ప్రత్యేక ఆసక్తి లేదని, అయితే పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే జీడబ్ల్యూఎంసీ మేయర్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ‘‘పదవి ముఖ్యం కాదు.. పార్టీ నిర్ణయమే ముఖ్యం’’ అని స్పష్టం చేశారు. ఈ దేశానికి కాంగ్రెస్ ఎంతో అవసరమని, పార్టీని బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు.
ప్రజాసేవలోనే సంతృప్తి.. ట్రస్ట్ ద్వారా సేవలు
రాజకీయ పదవుల కంటే ప్రజా, సామాజిక సేవ ద్వారానే తనకు ఎక్కువ సంతృప్తి లభిస్తుందని ఇనుగాల తెలిపారు. ఇనుగాల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకు సాయం చేయడం ఎంతో సంతృప్తినిస్తోందన్నారు. ప్రాణాలు కాపాడడంలో ఉండే ఆనందం మరేదాంట్లో ఉండదని చెప్పారు. ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలకు ఉపయోగిస్తున్న ప్రతి రూపాయి తమ కుటుంబ కష్టార్జితమేనని తెలిపారు. కుడా చైర్మన్‌గా రెండేళ్లు పనిచేసిన సమయంలో వచ్చిన జీతాన్ని కూడా పేదల సహాయానికే ఖర్చు చేశానన్నారు. ఎంజీఎం ఆస్పత్రిలో పిల్లల వైద్య విభాగంలో సౌకర్యాల కొరత గుర్తించి కోటి రూపాయలు అందించానని చెప్పారు. పరకాల ప్రభుత్వ ఆస్పత్రికి రూ.50 లక్షలు ఇస్తానని చెప్పానని, పీడియాట్రిషియన్ అందుబాటులో లేకపోతే డయాలసిస్ విభాగం ఏర్పాటుకు కూడా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. పార్టీ కార్యకర్తలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని, అర్ధరాత్రి ఫోన్ చేసినా స్పందిస్తానని తెలిపారు.
48 గంటల దీక్షతో రెవెన్యూ డివిజన్ సాధన
పరకాల రెవెన్యూ డివిజన్ కోసం గత ప్రభుత్వ హయాంలో అనేక పోరాటాలు చేశానని ఇనుగాల తెలిపారు. 2016లో 48 గంటల నిరాహార దీక్ష చేపట్టడంతో ప్రభుత్వం స్పందించిందన్నారు. టెక్స్టైల్ పార్కు కోసం భూములు కోల్పోయిన బాధితులకు మొదట ఎకరాకు రూ.3 లక్షల పరిహారం నిర్ణయించగా, పోరాడి ఎకరాకు రూ.10 లక్షలతోపాటు వంద గజాల స్థలం ఇప్పించేలా కృషి చేశానన్నారు. కుడా చైర్మన్‌గా ఉన్న సమయంలో సంస్థ బ్రాండ్ ఇమేజ్ను మార్చామని, ల్యాండ్ పూలింగ్ పథకాన్ని రాష్ట్రంలో ప్రత్యేకంగా నిలిచేలా చేశామని చెప్పారు. రైతులు స్వచ్ఛందంగా 225 ఎకరాలు ఇచ్చారని, రానున్న రోజుల్లో కుడాకు రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు లాభం వచ్చే అవకాశం ఉందన్నారు.
‘క్లీన్ అండ్ మెరిట్’తో డీసీసీ అధ్యక్ష పదవి
డీసీసీ అధ్యక్ష పదవి కోసం తాను ఎలాంటి పైరవీలు చేయలేదని ఇనుగాల స్పష్టం చేశారు. ఎన్నో అవకాశాలు, ఆఫర్లు వచ్చినా పార్టీ మారలేదన్నారు. ‘‘క్లీన్ అండ్ మెరిట్ వల్లే నాకు డీసీసీ అధ్యక్ష బాధ్యతలు వచ్చాయి’’ అని చెప్పారు. పార్టీ మారకుండా కొనసాగిన హార్డ్‌కోర్ కాంగ్రెస్ వాదులకు ప్రాధాన్యం ఇవ్వాలన్న రాహుల్‌గాంధీ నిర్ణయంలో భాగంగానే తనకు ఈ బాధ్యత దక్కిందన్నారు. తన విజన్ గురించి రాహుల్‌గాంధీకి వివరించినప్పుడు ఆయన తనను హగ్ చేసుకున్నారని చెప్పారు. బీజేపీకి తెరవెనుక ఆర్ఎస్ఎస్ ఎలా పనిచేస్తుందో.. కాంగ్రెస్‌కు కూడా సుశిక్షితమైన కార్యకర్తల సైన్యం ఉండాలని తాను భావిస్తున్నానన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డీసీసీ అధ్యక్షుల సమావేశంలో రాహుల్‌గాంధీ సమక్షంలోనే ఈ అంశాన్ని ప్రస్తావించానన్నారు. హనుమకొండ జిల్లాలో 500 మంది కార్యకర్తలను సైనికులుగా తీర్చిదిద్దుతున్నామని, ఎన్నికలు ఎక్కడ జరిగినా అక్కడికి వెళ్లి పార్టీ తరఫున ప్రచారం చేసేలా వారిని సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ‘‘కార్యకర్తలే నా బలం.. వారే నా సైన్యం’’ అని అన్నారు.
కేడర్‌కు పెద్దపీట.. దసరా నుంచి కొత్త కార్యాచరణ
డీసీసీ అధ్యక్షుడిగా అందరినీ కలుపుకొని వెళ్తున్నానని ఇనుగాల తెలిపారు. ఎమ్మెల్యేలు సూచించిన వారితోపాటు క్షేత్రస్థాయిలో పనిచేసే వారికి కమిటీల్లో ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. మహిళలకు పెద్దపీట వేస్తామని, జెన్జీతోపాటు జెన్ఆల్ఫాను కూడా పార్టీతో అనుసంధానం చేసే ఆలోచన ఉందన్నారు. ఈ నెల 31లోగా కమిటీలను పూర్తి చేస్తామని, ప్రతి 15 రోజులకు ఒకసారి డీసీసీలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. గ్రామస్థాయిలోనే ప్రజా సమస్యలు పరిష్కారం కావాలని అన్నారు. గ్రామ అధ్యక్షుడు తన పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తే ఎమ్మెల్యేలపై ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు. కింది స్థాయి నుంచి వచ్చే సూచనలను ఎమ్మెల్యేలు పరిశీలిస్తే పార్టీ మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు డిజిటలైజేషన్‌పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. హనుమకొండలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి దసరా వరకు శంకుస్థాపన జరిగే అవకాశం ఉందని చెప్పారు. కార్యాలయ నిర్మాణం కోసం ముఖ్య నేతలతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామన్నారు. దసరా నుంచి జిల్లాలో కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని, ప్రతి గ్రామంలో జెండా పండుగతోపాటు సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి నెలా కార్యవర్గ సమావేశం నిర్వహిస్తామన్నారు.
గ్రేటర్లో కాంగ్రెస్‌దే పాగా.. 46 నుంచి 48 డివిజన్లు
గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్‌దే పాగా అని ఇనుగాల ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నిర్వహించిన సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 66 డివిజన్లలో 46 నుంచి 48 డివిజన్లు కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉందన్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీతోపాటు ఇతర అభివృద్ధి పనులు ప్రారంభమైతే పార్టీ బలం మరింత పెరుగుతుందన్నారు. త్వరలో డివిజన్, బూత్ కమిటీలను ఏర్పాటు చేస్తామని, 13 మండలాల అధ్యక్షులను రంగంలోకి దింపుతామని తెలిపారు. ప్రతి వంద మంది ఓటర్లకు ఒక కార్యకర్తను నియమించే వ్యూహంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు.
సీఎం సభకు ఎందుకు వెళ్లలేదంటే..
పరకాలలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్న సభకు తాను హాజరుకాకపోవడంపై కూడా ఇనుగాల వివరణ ఇచ్చారు. అది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదని, ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రభుత్వ అధికారిక కార్యక్రమమని చెప్పారు. అందువల్ల తనకు ప్రొటోకాల్ లేదని, ఆ కారణంగానే సభకు హాజరుకాలేదని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి రాజకీయ కారణాలు లేవన్నారు. ఎన్నికల్లో గెలవాల్సింది వ్యక్తి కాదని.. పార్టీనే అన్న రాహుల్‌గాంధీ ఆలోచనను క్షేత్రస్థాయిలో అమలు చేస్తామని చెప్పారు. పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేస్తూ ముందుకు సాగుతానని, అధిష్ఠానం అప్పగించే ప్రతి బాధ్యతను శిరసావహిస్తానని ఇనుగాల వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు.

