ములుగు ఇసుక క్వారీల్లో వివాదం
తనపై హత్యాయత్నం జరిగిందంటూ బీఆర్ఎస్ చక్రపాణి ఆరోపణ
మూడు కార్లతో వెంబడించి అడ్డుకున్నారు
మారణాయుధాలు, రాళ్లతో కారు అద్దాలు ధ్వంసం చేశారు
అశోక్, విక్రమ్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, రఘు, లచ్చు పటేల్ వర్గీయుల ప్రమేయం
చెక్కులు నిలిపివేయాలని పైడాకుల అశోక్ బ్యాంకు మేనేజర్‌కు కాల్ చేశారు
ములుగు ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో బీఆర్‌ఎస్ నేత చక్రపాణి సంచలన ఆరోపణలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఇసుక క్వారీకి సంబంధించిన డబ్బులు, చెక్కుల వ్యవహారంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో తనను వెంబడించి కారును అడ్డుకుని దాడికి యత్నించారని బీఆర్‌ఎస్ నాయకుడు, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ చందా చక్రపాణి ఆరోపించారు. మారణాయుధాలు, రాళ్లతో తన కారుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారని, తనపై హత్యాయత్నానికి ప్రయత్నించారని పేర్కొంటూ ములుగు జిల్లా ఎస్పీకి బుధవారం ఫిర్యాదు చేశారు. ఎస్పీకి అందించిన ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. తనకు ప్రాణరక్షణ కల్పించి, ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. టేకులగూడెం ఇసుక క్వారీకి సంబంధించిన వ్యవహారంలో సొసైటీ అధ్యక్షుడు, సభ్యులు ఫోన్ చేయడంతో ఈ నెల 19న ఏటూరునాగారంలోని ఐటీడీఏ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి చెక్కులు తీసుకుని వాజేడు కాకతీయ గ్రామీణ బ్యాంకుకు వెళ్లినట్లు తెలిపారు. చెక్కులను బ్యాంకులో జమ చేసే సమయంలో హైదరాబాద్ అంబర్‌పేటకు చెందిన రాఘవేందర్‌రావు (రఘు), కొండగట్టుకు చెందిన సబ్‌కాంట్రాక్టర్లు విక్రమ్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డిలకు చెందిన వ్యక్తులు తనను గమనించారని ఆరోపించారు. చెక్కులను నిలిపివేయాలని బ్యాంకు మేనేజర్‌పై ఒత్తిడి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ బ్యాంకు మేనేజర్‌తో ఫోన్‌లో మాట్లాడి చెక్కులు నిలిపివేయాలని కోరినట్లు చక్రపాణి ఆరోపించారు. అయితే సమస్య ఏదైనా ఉంటే బయట మాట్లాడుకోవాలని, చెక్కులను నిలిపివేయడం సాధ్యం కాదని మేనేజర్ చెప్పినట్లు తెలిపారు. అనంతరం విక్రమ్‌రెడ్డి తనతో మాట్లాడాలని కోరగా, ప్రస్తుతం వీలు కాదని చెప్పానని, ఏటూరునాగారంలో మాట్లాడుకుందామని చెప్పినట్లు వివరించారు.


మూడు కార్లతో వెంబడింపు
అనంతరం ఏటూరునాగారం నుంచి ములుగు వైపు కారులో వస్తుండగా తనకు ఫోన్ చేసి ఎక్కడి వరకు వచ్చారని అడిగారని చక్రపాణి తెలిపారు. రాత్రి 7 గంటల సమయంలో నార్లాపూర్ మాజీ సర్పంచ్ ధరావత్ దేవానాయక్‌తో కలిసి ములుగు వైపు వస్తుండగా మూడు కార్లు తనను వెంబడించినట్లు ఆరోపించారు. కొండపర్తి స్టేజీ దాటి జలగలంద వాగు వద్ద నీలిరంగు కారుతో తన కారును ఓవర్‌టేక్ చేసి అడ్డుకున్నారని పేర్కొన్నారు. వెనుక వచ్చిన కార్ల నుంచి సుమారు పది మంది దిగారని, మారణాయుధాలు, రాళ్లతో తన కారుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారని ఫిర్యాదులో తెలిపారు. తనపై కూడా దాడికి ప్రయత్నించడంతో వెంటనే కారును వేగంగా ముందుకు తీసుకెళ్లి వారి నుంచి తప్పించుకుని ములుగుకు చేరుకున్నట్లు చెప్పారు.
ప్రాణరక్షణ కల్పించాలని వినతి
ఈ ఘటనలో రాఘవేందర్‌రావు (రఘు), విక్రమ్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డితోపాటు లచ్చు పటేల్ వర్గీయుల ప్రమేయం ఉందని చక్రపాణి ఆరోపించారు. తన కారును ధ్వంసం చేసిన ఘటనకు నార్లాపూర్ మాజీ సర్పంచ్ ధరావత్ దేవానాయక్ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారని తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తనకు ప్రాణరక్షణ కల్పించాలని ఎస్పీని కోరారు. ములుగు ఎస్పీని కలిసిన వారిలో ములుగు మండల పార్టీ అధ్యక్షుడు రమేష్‌రెడ్డి సానికొమ్మ, మున్సిపల్ కౌన్సిలర్ బైకాని సాగర్‌యాదవ్, జెడ్పీటీసీ రామసహాయం శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు దొడ్డపల్లి రఘుపతి, ములుగు జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల భిక్షపతి, సీపీఎం నాయకుడు, మాజీ జెడ్పీటీసీ వాజేడు లక్ష్మయ్య, పూనేం రాంబాబు, నుగురుచర్ల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తదితరులు పరామర్శించి ఘటన వివరాలు తెలుసుకున్నారు.

