పది పార్టీలు మారిన చరిత్ర నీది
నువ్వా కాంగ్రెస్‌ను విమర్శించేది?
సీఎం రేవంత్‌ను తిడుతుంటే వేదికపై చప్పట్లు కొట్టేది ఎవరు?
కాంగ్రెస్ నీకు ఏం తక్కువ చేసింది?
పార్టీని దెబ్బతీసేలా మాట్లాడితే ఊరుకునేది లేదు
కొండా ఫ్యామిలీపై వరంగల్ డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ డైరెక్ట్ ఎటాక్
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ‘పది పార్టీలు మారిన చరిత్ర ఉన్న మీరు కాంగ్రెస్‌ను విమర్శించేదేంటి? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బహిరంగ వేదికపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే పక్కనే ఉండి చప్పట్లు కొట్టేది ఎవరు?’ అంటూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ కొండా కుటుంబంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొండా సురేఖ, కొండా మురళిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో పదవులు, అవకాశాలు ఇచ్చినా పార్టీని, ముఖ్యమంత్రిని బహిరంగంగా విమర్శించడం సరికాదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. గురువారం ఎంజీఎం సెంటర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయూబ్ మాట్లాడారు. పది పార్టీలు మారిన చరిత్ర ఉన్న వారికి కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని అయూబ్ అన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో కాంగ్రెస్ జెండాను మోసి, కేసులు, అవమానాలు ఎదుర్కొని పార్టీని కాపాడింది కింది స్థాయి కార్యకర్తలేనని చెప్పారు. అలాంటి కార్యకర్తలను పక్కన పెట్టి పార్టీలు మారిన వారికి పదవులు, అవకాశాలు కల్పించడం ఏమిటని ప్రశ్నించారు. ‘అచ్చ కాంగ్రెస్.. పచ్చ కాంగ్రెస్’ అంటూ పార్టీని వర్గీకరించడం సరికాదని, కష్టపడిన కార్యకర్తలకు కాకుండా ఆయారాం గయారాంలకు ప్రాధాన్యం ఇవ్వడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.
సీఎం రేవంత్‌ను తిడుతుంటే చప్పట్లు కొట్టేది ఎవరు?
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బహిరంగ వేదికలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే అదే వేదికపై వరంగల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మీసాల ప్రకాశ్ ఎలా కూర్చుంటారని అయూబ్ ప్రశ్నించారు. సీఎంను అవమానిస్తుంటే చూస్తూ చప్పట్లు కొట్టడం ఏం సంస్కృతని నిలదీశారు. ఇదేనా కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న నిబద్ధత అని ప్రశ్నించారు. ప్రజల కోసం 24 గంటలు పనిచేస్తున్న ముఖ్యమంత్రిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ‘మేము ఐదుగురిని గెలిపించాం’ అంటూ కొండా దంపతులు చెప్పుకోవడాన్ని అయూబ్ ఎద్దేవా చేశారు. 2018లో పరకాల నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసిన వారు 2023లోనూ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి ఉంటే సత్తా ఉందని ఒప్పుకునేవాళ్లమన్నారు. సొంత నియోజకవర్గాన్ని వదిలి మరో చోటికి వెళ్లి గెలిచి, ఐదుగురిని గెలిపించామని చెప్పుకోవడం ఏం లాజిక్ అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ నీకు ఏం తక్కువ చేసింది?
కాంగ్రెస్ పార్టీ కొండా సురేఖకు అనేకసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా అవకాశం కల్పించిందని అయూబ్ గుర్తుచేశారు. కొండా మురళికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి గౌరవించిందన్నారు. ఇన్ని అవకాశాలు కల్పించిన పార్టీని, ముఖ్యమంత్రిని బహిరంగంగా విమర్శించడం ఏం పద్ధతని మండిపడ్డారు. పార్టీలో టికెట్ ఆశించడం తప్పు కాదని, అయితే అంతర్గత అంశాలను బహిరంగ వేదికలపైకి తీసుకువచ్చి పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడటం సరికాదన్నారు. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్న వారిపై కాంగ్రెస్ అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకోవాలని అయూబ్ డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పాలనలో కష్టపడి పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు అండగా నిలవాలని కోరారు. కొండా కుటుంబంపై డీసీసీ అధ్యక్షుడు అయూబ్ చేసిన తాజా వ్యాఖ్యలతో వరంగల్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి.

