వరంగల్ ట్రాఫిక్ కష్టాలకు చెక్!
రంగంలోకి దిగిన సీపీ శ్వేత
జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌తో కీలక సమీక్ష
159 చీకటి ప్రాంతాల గుర్తింపు
బ్లాక్‌స్పాట్లు, సిగ్నళ్లపై ప్రత్యేక దృష్టి
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: ట్రైసిటీలో ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత చర్యలకు శ్రీకారం చుట్టారు. గురువారం పోలీస్ కమిషనరేట్‌లో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న, ఎన్‌హెచ్‌ఏఐ పీడీ భరద్వాజ్, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్ అధికారులతో ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌పై సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ పోలీసులు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న బ్లాక్‌స్పాట్ల వివరాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ట్రైసిటీ పరిధిలో రాత్రివేళ వెలుతురు లేని 159 ప్రాంతాలను గుర్తించినట్లు సీపీ తెలిపారు. అక్కడ వెంటనే వీధిదీపాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పనిచేయని ట్రాఫిక్ సిగ్నళ్లను మరమ్మతు చేయడంతోపాటు అవసరమైన చోట కొత్త సిగ్నళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్ల ఆక్రమణలు, అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాల తొలగింపు, అనధికార పార్కింగ్ నియంత్రణపై దృష్టి పెట్టాలన్నారు. ప్రధాన కూడళ్లు, మలుపులు, యూటర్న్‌ల వద్ద సోలార్ బ్లింకర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆటోస్టాండ్లు, పార్కింగ్ స్థలాల ఏర్పాటుపైనా చర్చించారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న మాట్లాడుతూ పోలీసులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. సమావేశంలో డీసీపీ దారా కవిత, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, హనుమకొండ ఏసీపీ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

