నా తండ్రి మరణానికి సీతక్కే కారణం
నా కుటుంబ విషాదాన్ని రాజకీయాలకు వాడొద్దు
కాంగ్రెస్ నేతల ఇసుక, భూదందాలను పక్కదారి పట్టించేందుకే నా తండ్రి ప్రస్తావన
సతీష్‌రెడ్డికి మా కుటుంబ ఘటనతో ఎలాంటి సంబంధం లేదు
ములుగు మండల మాజీ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు రమేష్‌రెడ్డి
కాకతీయ, వరంగల్ బ్యూరో: దాదాపు 39 ఏళ్ల క్రితం జరిగిన తమ కుటుంబ విషాదాన్ని ఇప్పుడు రాజకీయ వివాదంలోకి లాగడం సరికాదని ములుగు మండల మాజీ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు రమేష్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతల ఇసుక, భూదందాలు, సెల్‌ఫోన్ స్కామ్స్‌పై సతీష్‌రెడ్డి ప్రశ్నిస్తున్న నేపథ్యంలో.. వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తన తండ్రి మరణం అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. తన తండ్రి మరణానికి అప్పటి నక్సలైట్లలో భాగమైన సీతక్కే కారణమని ఆయన ఆరోపించారు. ఈ ఘటనతో సతీష్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తన తండ్రిని మాట్లాడి పంపిస్తామని చెప్పి తీసుకెళ్లారని, అనంతరం ఆయన మృతదేహాన్ని ఇంటికి పంపించారని రమేష్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ ఘటన జరిగి దాదాపు నాలుగు దశాబ్దాలు గడిచిన తర్వాత దానిని ప్రస్తుత రాజకీయాలకు ముడిపెట్టడం బాధాకరమన్నారు. తన తండ్రి మరణాన్ని సతీష్‌రెడ్డికి ఆపాదించడం సమంజసం కాదని చెప్పారు.
కాంగ్రెస్ నాయకుల ఇసుక దందాలు, భూదందాలు, సెల్‌ఫోన్ స్కామ్స్ తదితర అంశాలను సతీష్‌రెడ్డి ప్రజల దృష్టికి తీసుకువస్తున్నారని తెలిపారు. దీంతో ఆయనపై రాజకీయంగా ఎదురుదాడి చేసేందుకే తమ కుటుంబానికి సంబంధించిన పాత విషాదాన్ని బయటకు తీస్తున్నారని ఆరోపించారు.
చనిపోయింది నా తండ్రి
“చనిపోయింది నా తండ్రి. ఆ ఘటనపై బాధ, ఆవేదన ఎవరికైనా ఉంటే మొదట నాకు ఉండాలి. సతీష్‌రెడ్డికి మా కుటుంబ ఘటనతో ఎలాంటి సంబంధం లేదు. రాజకీయ స్వలాభం కోసం ఈ విషాదాన్ని ఆయనకు ఆపాదించడం సరికాదు” అని రమేష్‌రెడ్డి అన్నారు. తాను, సీతక్క కుమారుడు కుంజ సూర్య చిన్న వయసులోనే తమ తండ్రులను కోల్పోయామని తెలిపారు. తమ కుటుంబాల్లో జరిగిన విషాదాలను రాజకీయాలకు ఉపయోగించుకోవడం బాధాకరమన్నారు. ములుగులో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను ప్రజలు నిశితంగా గమనించాలని రమేష్‌రెడ్డి కోరారు. ఎవరు ఏ అంశాన్ని ఎందుకు తెరపైకి తెస్తున్నారో ఆలోచించాలని సూచించారు. తన తండ్రి మరణం తమ కుటుంబానికి ఎప్పటికీ మాయని విషాదమని, దానిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడాన్ని సహించబోమని స్పష్టం చేశారు. తన కుటుంబ ఘటనను ప్రస్తుత రాజకీయ వివాదాలకు ఆపాదించే ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు.

