మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు తప్పవు
మైనర్ డ్రైవర్లపై కాజీపేట ట్రాఫిక్ పోలీసుల కేసులు
మార్పులు చేసిన సైలెన్సర్లతో శబ్ద కాలుష్య కేసులు
తల్లిదండ్రులు, వాహన యజమానులకు కౌన్సెలింగ్
కాకతీయ, హనుమకొండ: 18 సంవత్సరాలు నిండకముందే మైనర్లకు వాహనాలు ఇస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కాజీపేట ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు, వాహన యజమానులు బాధ్యత వహించాలని సూచించారు. హంటర్ రోడ్‌లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో శబ్ద కాలుష్యంతో వాహనాలు నడుపుతున్న మైనర్లను గుర్తించి మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు చేశారు.
2 ద్విచక్ర వాహనాలకు మార్పులు చేసిన సైలెన్సర్లు ఉండటంతో శబ్ద కాలుష్య కేసులు కూడా నమోదు చేశారు. మైనర్ల తల్లిదండ్రులు, వాహన యజమానులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. గతంలో పట్టుబడిన 9 మంది మైనర్లను కోర్టులో హాజరుపరచగా, ఒక్క రోజు జువైనల్ హోమ్‌కు పంపుతూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత వాహన యజమానులకు జరిమానాలు విధించారు. మైనర్లకు వాహనాలు ఇస్తున్న తల్లిదండ్రులు, యజమానులపై కూడా కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచడంతో పాటు జరిమానా లేదా జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు స్పష్టం చేశారు. పిల్లల భద్రత, రహదారి భద్రతను దృష్టిలో ఉంచుకుని 18 సంవత్సరాలు నిండే వరకు వాహనాలు నడపడానికి అనుమతించవద్దని విజ్ఞప్తి చేశారు.

