వరంగల్లో విషాదం.. గర్భిణీ మృతి
వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ
చికిత్స అనంతరం ఫిట్స్.. మరో ఆస్పత్రికి తరలింపు
వెంకట్రామ థియేటర్ వద్ద రాస్తారోకో.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన మృతురాలి బంధువులు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ కాశిబుగ్గలో విషాదం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే గర్భిణీ మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు వెంకట్రామ థియేటర్ సమీపంలో రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కాశిబుగ్గకు చెందిన అస్త్రం లత (34)కు గత మంగళవారం డాక్టర్ సంధ్యారాణి ఆస్పత్రిలో ప్రసవ ఆపరేషన్ జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం ఆమెకు ఫిట్స్ రావడంతో సంరక్ష ఆస్పత్రికి తరలించారని, అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం 11 గంటలకు మృతి చెందినట్లు చెప్పారు. వైద్యుల తప్పుడు చికిత్స వల్లే లత మృతి చెందిందని వారు ఆరోపించారు. పుట్టిన శిశువు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. లత మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదంటూ బంధువులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు.

