25 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం
ముగ్గురిపై కేసు నమోదు
కాకతీయ, తుంగతుర్తి : ప్రభుత్వం పేదలకు సరఫరా చేస్తున్న పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి తరలిస్తున్న ముగ్గురిపై నూతన్‌కల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారు 25 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఆత్మకూర్(ఎస్) మండలం రామన్నగూడెంకు చెందిన చలమల వీరస్వామి, ఆయన కుమారుడు చలమల లెనిన్, మిర్యాల గ్రామానికి చెందిన పీడీఎస్ బియ్యం డీలర్ కృష్ణారెడ్డి వద్ద నుంచి కిలో రూ.15 చొప్పున బియ్యాన్ని కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అశోక్ లేలాండ్ మినీ గూడ్స్ వాహనం (టీఎస్07-యూజే-0634)లో మామిళ్లమడవ గ్రామ శివారులోని కోళ్లఫారానికి తరలిస్తుండగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో మిర్యాల గ్రామ శివారులో వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు 25 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం, విక్రయించడం, తరలించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.

