పీఎం శ్రీ పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
బోధనతోపాటు క్రీడలు, సాంకేతిక నైపుణ్యాలపై దృష్టి
విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర
జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
కాకతీయ, జనగామ : విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. గురువారం పాలకుర్తి మండలంలోని పీఎం శ్రీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, వంటశాల, పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. హిందీ, ఇంగ్లిష్, గణితం, సాంఘికశాస్త్రంలో వారి అభ్యాస సామర్థ్యాన్ని పరీక్షించారు. బ్లాక్‌బోర్డుపై గణితం, సాంఘికశాస్త్ర అంశాలను స్వయంగా బోధించారు. పాఠ్యాంశాల పూర్తిపై ఆరా తీశారు. విద్యార్థులు ప్రతి సబ్జెక్టును సులభంగా అర్థం చేసుకునేలా బోధించాలని సూచించారు. చదువుతోపాటు చెస్, వాలీబాల్, ఖోఖో, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్‌లో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. పాత బెంచీలను మరమ్మతు చేసి ఇతర పాఠశాలలకు తరలించాలని, ప్రత్యేక గదిలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని సూచించారు. దెబ్బతిన్న కిటికీలు, ఫ్యాన్లు, తరగతి గదుల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, కంప్యూటర్, కోడింగ్ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వేదవతి, ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి తదితరులు పాల్గొన్నారు.


