విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట
స్కిల్డ్ విద్యతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ విద్య, వైద్య రంగాలను బలోపేతం చేసి మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం ఎర్రగడ్డ గ్రామపంచాయతీ పరిధిలోని గోపాలపురంలో రూ.30 లక్షలతో నిర్మించనున్న ప్రాథమిక పాఠశాల భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో గడిచిన రెండున్నరేళ్లుగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. గత పాలకుల కంటే విద్య, వైద్య రంగాలకు రెండు, మూడు రెట్లు అధికంగా నిధులు వెచ్చిస్తున్నామని చెప్పారు. పేదలపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వ ఆసుపత్రులను నిర్మిస్తూ, వైద్యులు, సిబ్బందిని నియమించి, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. సాంకేతిక విద్యను బలోపేతం చేసేందుకు నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి, సాంకేతిక విద్యలో శిక్షణ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచుతామని తెలిపారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రెండున్నరేళ్లలో వడ్డీలేని రుణాలుగా రూ.63 వేల కోట్లు ఇప్పించామని వివరించారు. రైతుల సంక్షేమానికి భవిష్యత్తులోనూ మరిన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.

నాలుగో విడతలోనూ ఇందిరమ్మ ఇళ్లు
ఇచ్చిన హామీ మేరకు సన్నబియ్యం, రేషన్ కార్డులు అందించామని, ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతను పూర్తి చేశామని మంత్రి తెలిపారు. పేదవాడికి సొంతిల్లు ఉండాలన్న లక్ష్యంతో మూడో, నాలుగో విడతల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. అర్హులంతా ఈ నెల 31లోగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని, త్వరలో కొత్త పింఛన్లు అందిస్తామని చెప్పారు. కార్యక్రమానికి హాజరైన మహిళలతోపాటు పాలేరు నియోజకవర్గ, రాష్ట్ర ఆడబిడ్డలందరికీ ముందస్తుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

