భూపాలపల్లి మైన్స్ ఏడీ ఇళ్లపై ఏసీబీ రైడ్
ఏక కాలంలో 12 ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు
నగదు, బంగారం, ఆస్తి పత్రాల పరిశీలన
ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలపై దాడులు
భూపాలపల్లి, ములుగు, వరంగల్, హైదరాబాద్‌తో పాటు సూర్యాపేట, తాండూరులో సోదాలు
గతంలోనూ ఆరోపణలు.. ఏసీబీ అధికారిక వివరాల కోసం ఎదురుచూపులు
కాకతీయ,తెలంగాణ బ్యూరో : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీ బొజ్జ జయరాజు నివాసాలు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నట్లు సమాచారం. భూపాలపల్లి, ములుగు, వరంగల్, హైదరాబాద్‌లోని బోడుప్పల్‌తో పాటు సూర్యాపేట, తాండూరు తదితర ప్రాంతాల్లో సుమారు 12 చోట్ల ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. జయరాజుకు సంబంధించిన నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో భారీగా నగదు, బంగారం లభించినట్లు సమాచారం. దీంతో పాటు ఆస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు ఖాతాలు, లాకర్లు, ఇతర ఆర్థిక లావాదేవీల వివరాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న తనిఖీల్లో కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం. అయితే సోదాలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం, ఆస్తుల పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. ఏసీబీ అధికారుల అధికారిక ప్రకటన అనంతరం ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

గతంలోనూ అవినీతి ఆరోపణలు
బొజ్జ జయరాజు గతంలో ములుగు జిల్లా మైన్స్ ఏడీగా పనిచేసిన సమయంలో ఇసుక, మట్టి క్వారీల వ్యవహారాల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ పలు ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. క్వారీలు, ఇసుక వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడి కోట్ల రూపాయలు కూడబెట్టారంటూ అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏసీబీ సోదాలు జరగడంతో గతంలో వచ్చిన ఈ ఆరోపణలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అయితే గతంలో వచ్చిన ఆరోపణలకు, ప్రస్తుతం సోదాల్లో గుర్తించిన ఆస్తులకు మధ్య ఉన్న సంబంధంపై ఏసీబీ అధికారికంగా వెల్లడించే వివరాల ఆధారంగానే స్పష్టత రానుంది. సుమారు 12 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. నగదు, బంగారం, ఆస్తి పత్రాలతో పాటు బ్యాంకు ఖాతాలు, లాకర్ల వివరాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సోదాలు పూర్తయిన అనంతరం స్వాధీనం చేసుకున్న ఆస్తులు, నగదు, బంగారం విలువతో పాటు ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలకు సంబంధించి ఏసీబీ అధికారులు అధికారికంగా వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

