1000 రోజుల కాంగ్రెస్ పాలనే మా ప్రోగ్రెస్ రిపోర్ట్
బీఆర్ఎస్ పాలనలో విద్యారంగం నిర్లక్ష్యం
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో పదేళ్లు కథలు చెప్పారు
నిర్మాణాత్మక విమర్శలకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమే
అధికారం పోయిందన్న అక్కసుతోనే బీఆర్ఎస్ విమర్శలు
వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య ధ్వజం
కాకతీయ, హన్మకొండ : అధికారం కోల్పోయామన్న అక్కసుతోనే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని, ప్రతిపక్ష బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. బుధవారం హనుమకొండ డీసీసీ కార్యాలయంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డితో కలిసి ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని కావ్య తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల భారంలోకి నెట్టినప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. విద్యారంగాన్ని బీఆర్ఎస్ పదేళ్లపాటు నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను ఉపయోగించుకున్న ఆ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి భవిష్యత్ కోసం ఏం చేసిందని ప్రశ్నించారు. విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్స్లర్ల నియామకం, విద్యాశాఖపై ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్ష వంటి అంశాలను ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డీఎస్సీ ద్వారా సుమారు 10 వేల మంది ఉపాధ్యాయులను నియమించిందని, వివిధ శాఖల్లో సుమారు 70 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా సుమారు రూ.60 వేల కోట్ల రుణాలు అందించినట్లు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయిందని విమర్శిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తొలి దశలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందన్నారు. కేసీఆర్‌కు రాజకీయ అనుభవం ఉందని, నిర్మాణాత్మక సూచనలు చేస్తే ప్రభుత్వం స్వీకరించేందుకు సిద్ధంగా ఉందని కావ్య తెలిపారు. ప్రతిరోజూ రాజకీయ విమర్శలు చేయడం కంటే ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించేందుకు ప్రతిపక్షాలు ముందుకు రావాలని సూచించారు. “చెప్పినవి చేస్తున్నాం.. చెప్పనివి కూడా చేస్తున్నాం. 1000 రోజుల కాంగ్రెస్ పాలనే మా ప్రోగ్రెస్ రిపోర్ట్” అని ఎంపీ డా. కడియం కావ్య స్పష్టం చేశారు. అనంతరం మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.

