సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష
కాంగ్రెస్ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి
2029లో రాహుల్‌గాంధీ ప్రధాని కావడం ఖాయం
పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి పనిచేసే వారికే గౌరవం
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
కాకతీయ, జనగామ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే పార్టీకి శ్రీరామరక్ష అని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. లింగాల ఘనపూర్ మండలంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేస్తే 2029లో రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని కడియం శ్రీహరి అన్నారు. కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని పేర్కొన్నారు. పాత, కొత్త అనే తేడాలు పక్కనపెట్టి పార్టీ నిబంధనలకు అనుగుణంగా పనిచేసే వారికే తన వద్ద గౌరవం ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.
బీఆర్‌ఎస్ ఆరోపణలకు ముందు సమాధానం చెప్పాలి
బీఆర్‌ఎస్ నాయకులు గతంలో చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారని కడియం శ్రీహరి విమర్శించారు. కవిత చేసిన అవినీతి ఆరోపణలకు ముందుగా బీఆర్‌ఎస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్‌పై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, గత 12 ఏళ్లలో ప్రధాని మోదీ తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు గానీ, రూ.వెయ్యి కోట్ల నిధులు గానీ ఇవ్వలేదని ఆరోపించారు.
ప్రతి గ్రామానికి రెండు పంటలకు సాగునీరు
లింగాల ఘనపూర్ మండలంలోని ప్రతి గ్రామానికి రెండు పంటలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. జీడికల్ రోడ్డు నిర్మాణంతో పాటు కోడూరు, కన్నాయిపల్లి, చీటూరు రోడ్లను త్వరలోనే పూర్తి చేయిస్తానని తెలిపారు. గ్రామాల్లో బెల్ట్ షాపులను నిషేధించేందుకు గ్రామసభల్లో తీర్మానాలు చేయాలని సూచించారు. యువత గంజాయికి బలికాకుండా గ్రామస్థాయిలో సామాజిక బాధ్యతతో చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఇందిరా, ఉపాధ్యక్షులు గుడి వంశీధర్‌రెడ్డి, కిసర దిలీప్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శివకుమార్, మండల అధ్యక్షుడు సాధం విజయ్ మనోహర్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

