ఏటూరునాగారంలో అభివృద్ధిపై పట్టింపేది.?
వెయ్యి రోజుల పాలనలో హామీలకు దిక్కేది?
ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీల అమలుపై లెక్క చెప్పాలి
రైతుబంధు, రుణమాఫీపై చెప్పేదొకటి.. చేసేదొకటి
హామీలు నెరవేర్చే వరకు ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తాం
ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు
కాకతీయ, ఏటూరునాగారం : ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తయినా ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోలేదని ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు ధ్వజమెత్తారు. కేసీఆర్ ఆదేశాలు, కేటీఆర్ పిలుపు, హరీశ్‌రావు సూచనల మేరకు చేపడుతున్న వారం రోజుల కార్యక్రమాల్లో భాగంగా ఏటూరునాగారంలో మూడో రోజు బీఆర్ఎస్ నిరసన చేపట్టింది. ఓడవాడ హనుమాన్ ఆంజనేయస్వామి ఆలయం నుంచి బస్టాండ్ వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సుమారు 3 వేల మంది పాల్గొన్నారు. ఈసందర్భంగా లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పటివరకు ఎన్ని హామీలు అమలు చేసిందో ప్రజలకు లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధుల పింఛన్‌ను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచడం, యువతకు రూ.5 లక్షల గ్యారెంటీ కార్డు, విదేశీ విద్య, విదేశాలకు వెళ్లే వారికి రూ.25 లక్షల రుణం వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన హామీలను అమలు చేశామని చెబుతున్న కాంగ్రెస్.. ఇప్పుడు తాము ఇచ్చిన హామీల అమలుపై ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. రైతుబంధు, రుణమాఫీ విషయంలోనూ ప్రభుత్వం చెప్పేదొకటి.. చేసేదొకటిగా ఉందని విమర్శించారు. ఎన్నికలకు ముందు ప్రజలను నమ్మించేందుకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించడం సరికాదన్నారు. రైతులు, మహిళలు, యువత, పేదలు, దివ్యాంగుల సమస్యలను పట్టించుకోవాల్సిన ప్రభుత్వం వాటిపై సమాధానం చెప్పకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు.

ఏటూరునాగారం అభివృద్ధిపై ప్రభుత్వం చేతులేత్తెసింది
ఏటూరునాగారం అభివృద్ధి విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని లక్ష్మణ్‌బాబు అన్నారు. ఏటూరునాగారం బస్‌డిపో విషయంలో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘మీరు కట్టారా?’’ అంటూ ఎదురు ప్రశ్నలు వేయడం కాదని, అధికారంలోకి వచ్చిన తర్వాత బస్‌డిపో ఎందుకు నిర్మించలేదో చెప్పాలని నిలదీశారు. గోదావరి కరకట్ట నిర్మాణం పూర్తికాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రైతుల సమస్యల పరిష్కారం కోసం గోదావరి వెంట పాదయాత్ర చేపడతామని ప్రకటించారు. కేసీఆర్ హయాంలో మంజూరైన ఏటూరునాగారం ఆర్డీఓ కార్యాలయం మూడేళ్లుగా ఎందుకు పూర్తికాలేదని ప్రశ్నించారు. హెచ్ఏఎం రోడ్ల నిర్మాణ విధానంపై కూడా ప్రభుత్వం ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేస్తోందని విమర్శించిన కాంగ్రెస్.. ఇప్పుడు రోడ్ల నిర్మాణానికి రుణ ఆధారిత విధానాలను ఎందుకు అనుసరిస్తోందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన ఇళ్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటోందని ఆరోపించారు. ఏటూరునాగారంలో మంజూరైన 170 ఇళ్లలో 150 నిర్మాణాలు ప్రారంభమైనప్పటికీ సుమారు 60 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు.

కొండా సురేఖకు గౌరవం ఇవ్వ లేదు
మాజీ మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ ప్రభుత్వం తగిన గౌరవం ఇవ్వడం లేదని లక్ష్మణ్‌బాబు విమర్శించారు. కొండా సురేఖ కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉందని, రాజకీయ ప్రత్యర్థులమైనప్పటికీ అసత్య ఆరోపణలు చేయబోమని అన్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సురేఖను మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ఏర్పాట్లలో తగిన విధంగా భాగస్వామ్యం చేయలేదని ఆరోపించారు. జాతర సమయంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో సురేఖ ఫొటోకు ప్రాధాన్యం ఇవ్వకుండా మంత్రి సీతక్కే మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చూపించారని విమర్శించారు. బీసీ మహిళగా ఉన్న కొండా సురేఖకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తగిన గౌరవం ఇవ్వడం లేదని అన్నారు. మేడారం జాతర నిధుల వినియోగానికి సంబంధించి సుమారు రూ.250 కోట్లపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని పేర్కొంటూ.. వాటిపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని లక్ష్మణ్‌బాబు డిమాండ్ చేశారు. భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులు, రాజగోపాల్‌రెడ్డికి సంబంధించిన ప్రభుత్వ పనులు, బిల్లుల విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. ‘దొరల గడులు బద్దలు కొడతాం’ అంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలకు లక్ష్మణ్‌బాబు ఘాటుగా బదులిచ్చారు. ఏటూరునాగారంలో దొరల గడులు లేవని, ప్రజల కోసం ఎప్పుడూ తెరిచి ఉండే ‘జనతా గ్యారేజ్’ ఉందని అన్నారు. తరతరాలుగా ప్రజలకు అండగా నిలుస్తూ, వారి కష్టాల్లో పగలు–రాత్రి తేడా లేకుండా అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నానని చెప్పారు. తమ గొంతు నొక్కాలని చూసినా వెనక్కి తగ్గబోమని, ప్రజలతో కలిసి ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.

ఫ్లెక్సీల తొలగింపుతో ఉద్రిక్తత..!
బస్టాండ్ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఫ్లెక్సీల తొలగింపుపై లక్ష్మణ్‌బాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పోలీసులతో వాగ్వాదం జరిగింది. మంత్రి సీతక్క ఆదేశాలతోనే ఫ్లెక్సీలు తొలగించారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో ఏటూరునాగారం ఎస్ఐ మహేశ్, లక్ష్మణ్‌బాబు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి ప్రతిపక్ష గొంతును నొక్కాలని చూస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. మిగిలిన నాలుగు రోజుల కార్యక్రమాలను మరింత ఉధృతంగా నిర్వహిస్తామని లక్ష్మణ్‌బాబు తెలిపారు. యువత కార్యక్రమంతోపాటు ములుగు, వెంకటాపురం ప్రాంతాల్లో భారీ ర్యాలీలు చేపడతామని చెప్పారు. ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలను అమలు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మహిళలు, రైతులు, యువత, పేదలు, దివ్యాంగుల సమస్యలపై ప్రజా ఉద్యమాలు చేపడతామని, హామీలు నెరవేర్చకపోతే ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ప్రజల తరఫున పోరాడతామని లక్ష్మణ్‌బాబు హెచ్చరించారు.

