ఇదేమీ విచిత్రమో..!
డీటీవో సెలవులో ఉన్న ఆయన పేరుతోనే సర్టిఫికెట్ల జారీ
ఇన్చార్జి బాధ్యతలు కూడా ఎవరికీ అప్పగించలేదు
నిబంధనలకు విరుద్ధంగా జిల్లా రవాణా శాఖ అధికారి వ్యవహారం
సెలవులోనూ ఇన్చార్జి బాధ్యతలను అప్పగించని అధికారి
గతంలోనూ ఇలాగే అనేక సార్లు చేసినట్లుగా ఆరోపణలు
డీటీవో లాగిన్ వినియోగంపై ఉన్నతాధికారుల విస్మయం
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో జిల్లా రవాణాశాఖ అధికారి ఈశ్వర్ సింగ్ ఠాకూర్ (డీటీఓ) అధికారిక లాగిన్ వినియోగంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెప్టెంబరు 2న డీటీఓ ఈశ్వర్ సింగ్ ఠాకూర్ నిర్మల్ జిల్లా కోర్టుకు వెళ్లి కార్యాలయంలో అందుబాటులో లేని సమయంలోనూ ఆయన పేరుతో ఉన్న లాగిన్ నుంచి ధ్రువపత్రాలు జారీ అయ్యాయి. అధికారి కార్యాలయంలో లేని వేళ ఆయన లాగిన్‌ను ఎవరు ఉపయోగించారు? ఏ అధికారం మేరకు కార్యకలాపాలు నిర్వహించారు? అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. డీటీఓ విధులకు దూరంగా ఉన్నప్పుడు కార్యాలయ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ప్రత్యామ్నాయ అధికారికి బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది. సెప్టెంబరు 2న డీటీఓకు సెలవు లేదా శాఖాపరమైన అనుమతి ఉందా? ఉంటే ఆ రోజు ఇన్‌చార్జ్‌గా ఎవరిని నియమించారు? ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారా? అన్న వివరాలను రవాణాశాఖ వెల్లడించాలి. ఇన్‌చార్జ్ నియమించి ఉంటే ఆ అధికారి పేరుతోనే అధికారిక కార్యకలాపాలు ఎందుకు నిర్వహించలేదన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది.

లాగిన్ నుంచే ధ్రువపత్రాలా?
డీటీఓకు కేటాయించిన అధికారిక లాగిన్ ద్వారా శాఖాపరమైన కీలక ప్రక్రియలు జరుగుతాయి. అలాంటి లాగిన్ నుంచి అధికారి అందుబాటులో లేని సమయంలో ధ్రువపత్రాలు జారీ అయ్యాయనే ఆరోపణలు రావడం సాధారణ అంశం కాదు. ఆ రోజు లాగిన్ ఎప్పుడు తెరవబడింది? ఏ కంప్యూటర్ లేదా వ్యవస్థ నుంచి వినియోగించారు? ఎన్ని ధ్రువపత్రాలు జారీ అయ్యాయి? అన్న వివరాలు లాగిన్ లాగ్స్ పరిశీలిస్తే స్పష్టమయ్యే అవకాశం ఉంది. లాగిన్ వివరాలు ఇతరులకు చేరాయా? లేక అధికారిక అనుమతితోనే వినియోగించారా? అన్నదీ విచారణలో తేలాలి.
ఉన్నతాధికారులకు సమాచారం ఉందా?
డీటీఓ కోర్టుకు వెళ్లిన విషయం ఉన్నతాధికారులకు ముందే తెలుసా? ఆయనకు అనుమతి ఉందా? కార్యాలయ బాధ్యతలను మరొక అధికారికి అప్పగించారా? అన్న అంశాలపై స్పష్టత అవసరం. ఒకవేళ అన్ని అనుమతులతోనే ప్రక్రియ కొనసాగితే ఆ రోజు లాగిన్ వినియోగానికి సంబంధించిన విధానాన్ని శాఖ వివరించాలి. అనుమతి లేకుండా అధికారి కార్యాలయానికి దూరంగా ఉన్నట్లయితే దానిపైనా శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయంలో అధికారి అందుబాటులో లేకపోయినా ఆయన పేరుతో అధికారిక వ్యవహారాలు సాగుతున్నాయనే ఆరోపణలు రావడం పర్యవేక్షణ వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం ఉందా?
ములుగు రవాణాశాఖ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగులు నిర్వహించాల్సిన వ్యవహారాల్లో ప్రైవేటు వ్యక్తుల జోక్యం ఉంటోందన్న ఆరోపణలు గతంలోనూ వినిపించినట్లు స్థానికంగా చర్చ ఉంది. ఈ నేపథ్యంలో డీటీఓ లాగిన్ ఇతరుల చేతికి వెళ్లిందా? ప్రైవేటు వ్యక్తులు దానిని వినియోగించారా? అన్న అనుమానాలకు కూడా ఉన్నతాధికారులు తెరదించాల్సి ఉంది. అధికారిక లాగిన్ వివరాలను ఇతరులకు అందించినట్లు తేలితే బాధ్యత ఎవరిదన్నది కూడా నిర్ణయించాలి. డీటీఓ గతంలో నిర్వహించిన చెక్‌పోస్టు విధులపైనా డబ్బుల వసూళ్లకు సంబంధించిన ఆరోపణలు ఉన్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత లాగిన్ వ్యవహారంతోపాటు గత ఫిర్యాదులు, విధుల నిర్వహణకు సంబంధించిన రికార్డులను కూడా పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. ఆరోపణల్లో వాస్తవం లేకపోతే అధికారికంగా స్పష్టం చేయాలి. వాస్తవం ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
లాగిన్ లెక్క తేల్చాల్సిందే!
సెప్టెంబరు 2న జరిగిన వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. డీటీఓ హాజరు, సెలవు లేదా అనుమతి వివరాలు, ఇన్‌చార్జ్ నియామకం, లాగిన్ లాగ్స్, ఆ రోజు జారీ చేసిన ధ్రువపత్రాల వివరాలను పరిశీలించాలి. అధికారిక లాగిన్‌ను ఎవరు వినియోగించారో సాంకేతిక ఆధారాలతో నిర్ధారించాలి. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. లేకపోతే డీటీఓ కార్యాలయంలో లేకున్నా ఆయన లాగిన్ ఎలా పనిచేసిందన్న ప్రశ్నకు సమాధానం దొరకదు.

