విగ్రహ గద్దె కూల్చివేత దుర్మార్గం
పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం ఏర్పాటు చేసి తీరుతాం
పరకాల, రామప్ప ప్రాజెక్టుల కోసం పెద్ది సుదర్శన్‌రెడ్డి కృషి
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
కాకతీయ, నర్సంపేట టౌన్ : పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కోసం అశోక్‌నగర్‌లో ఏర్పాటు చేసిన గద్దెను కూల్చివేయడం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం అశోక్‌నగర్‌లో గద్దె కూల్చివేసిన ప్రాంతాన్ని ఆయన సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. విగ్రహ ఆవిష్కరణను అడ్డుకోవడం వెనుక కాంగ్రెస్ నాయకుల కుట్ర ఉందని ఆరోపించారు. ప్రజలు, అభిమానులు పెద్ది సుదర్శన్‌రెడ్డి సేవలను గుర్తుచేసుకుంటూ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటుంటే రాజకీయ కక్షతో అడ్డుకోవడం సరికాదన్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రి గద్దె నిర్మాణాన్ని కూల్చివేయడం దారుణమన్నారు. నర్సంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన ఇతర విగ్రహాలకు ఏ విధమైన అనుమతులు ఉన్నాయో అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి
పాకాల, రామప్ప ప్రాజెక్టుల ద్వారా నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు పెద్ది సుదర్శన్‌రెడ్డి విశేషంగా కృషి చేశారని దయాకర్‌రావు పేర్కొన్నారు. మెడికల్ కళాశాలను తీసుకురావడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆయన సేవలకు గుర్తింపుగా అభిమానులు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తే అడ్డంకులు సృష్టించడం తగదన్నారు. ఎన్ని ఆటంకాలు కల్పించినా అశోక్‌నగర్‌లో పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతామని దయాకర్‌రావు స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఆయన విగ్రహాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కళాశాలకు పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరు పెడతామని కేటీఆర్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని దయాకర్‌రావు ఆరోపించారు. ఈ చర్యలకు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, అప్పుడు ఎవ్వరినీ వదిలిపెట్టబోమని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

