విద్యార్థులను మోసగించిన కాంగ్రెస్
జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ హామీల విస్మరణ
ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకుండా గోస పెడుతున్న ప్రభుత్వం
జీఓ 97ను వెంటనే రద్దు చేయాలి : మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్
వర్ధన్నపేట గడ్డపై కదం తొక్కిన విద్యార్థి లోకం.. భారీ ర్యాలీ
కాకతీయ, వర్ధన్నపేట: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తయినా యువత, విద్యార్థులకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ విమర్శించారు. బీఆర్‌ఎస్ చేపట్టిన వారం రోజుల పోరుబాటలో భాగంగా 4వ రోజు భీమారం జంక్షన్ నుంచి ఎర్రగట్టుగుట్ట జంక్షన్ వరకు విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ర్యాలీని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారని, దీంతో బీఆర్‌ఎస్ శ్రేణులు ప్రతిఘటించాయని ఆయన అన్నారు. పోలీసులు భారీగా మోహరించడంతో భీమారం ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం వద్దు
ఎన్నికల సమయంలో యూత్ డిక్లరేషన్ పేరుతో యువత, విద్యార్థుల భవిష్యత్తును మారుస్తామని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులు పూర్తయినా వాటిని అమలు చేయలేదని అరూరి రమేష్ అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న రూ.11,300 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యూత్ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను యుద్ధప్రాతిపదికన అమలు చేయాలని కోరారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే జీఓ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులు తమ హక్కుల కోసం రోడ్లపైకి వచ్చి పోరాడాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ర్యాలీకి స్వచ్ఛందంగా హాజరయ్యేందుకు సిద్ధమైన విద్యార్థులు రాకుండా కాంగ్రెస్ నాయకులు కళాశాలలపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడకుండా ప్రభుత్వం వెంటనే హామీలను అమలు చేయాలని, లేకపోతే విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని, కేసులకు భయపడవద్దని, పార్టీ నాయకులు, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని అరూరి రమేష్ అన్నారు.

