2–3 ఏళ్లలో ఈ-బైక్‌ల వాటా 20 శాతానికి
రూ.779 కోట్లతో కొత్త ప్లాంట్.. ఏటా 5 లక్షల వాహనాల ఉత్పత్తి లక్ష్యం
రూ.2 లక్షలలోపే కొత్త మోడళ్లు.. విదేశీ మార్కెట్లపై సంస్థ దృష్టి
ఎలక్ట్రిక్ టూ వీలర్ సంస్థ అల్ట్రావైలెట్ ఆటోమోటివ్ అంచనా
కాకతీయ, బిజినెస్ డెస్క్ : దేశీయ మోటార్‌సైకిల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ బైక్‌లకు ఆదరణ వేగంగా పెరుగుతోందని బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ సంస్థ అల్ట్రావైలెట్ ఆటోమోటివ్ తెలిపింది. రాబోయే 2–3 ఏళ్లలో దేశంలో మొత్తం మోటార్‌సైకిళ్ల విక్రయాల్లో ఎలక్ట్రిక్ బైక్‌ల వాటా 20 శాతానికి చేరుతుందని అంచనా వేసింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. తమిళనాడులోని హోసూర్ సమీపంలో కొత్త తయారీ ప్లాంట్ ఏర్పాటుకు రాబోయే 5 ఏళ్లలో రూ.779 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది. కొత్త ప్లాంట్ తొలి దశలో ఏటా 2.5 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఏర్పాటు కానుంది. భవిష్యత్తులో ఈ సామర్థ్యాన్ని 5 లక్షల యూనిట్లకు పెంచనున్నారు. ప్రస్తుతం ఉన్న 50–60 వేల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలుపుకొని.. 2–3 ఏళ్లలో మొత్తం సామర్థ్యాన్ని 3 లక్షల యూనిట్లకు, 5 ఏళ్లలో 5 లక్షల యూనిట్లకు చేర్చాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
రూ.2 లక్షలలోపే కొత్త బైక్‌లు
ప్రస్తుతం ఎఫ్77, ఎక్స్47 మోడళ్లను విక్రయిస్తున్న అల్ట్రావైలెట్.. త్వరలో *షాక్వేవ్ మోటార్‌సైకిల్, టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్*ను మార్కెట్లోకి తీసుకురానుంది. రాబోయే 2 ఏళ్లలో తమ మోడళ్ల సంఖ్యను 6కు పెంచాలని నిర్ణయించింది. కొత్త మోడళ్ల ధరలను రూ.2 లక్షలలోపే ఉండేలా చూస్తున్నామని సంస్థ కో-ఫౌండర్, సీటీఓ నీరజ్ రాజ్‌మోహన్ తెలిపారు. కొత్త ఉత్పత్తుల రాకతో నెలకు 10 వేల యూనిట్ల విక్రయాలను సాధించగలమని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.
విదేశీ మార్కెట్లపైనా దృష్టి
ప్రస్తుతం 20 యూరోపియన్ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అల్ట్రావైలెట్.. తదుపరి దశలో ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికా మార్కెట్లలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. స్కూటర్ల విభాగంలో ప్రారంభమైన ఎలక్ట్రిక్ మార్పు ఇప్పుడు మోటార్‌సైకిళ్ల విభాగానికీ విస్తరిస్తోందని సంస్థ సీఈఓ నారాయణ్ సుబ్రమణ్యం తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పెరుగుతున్న ఇంధన ధరలు, వినియోగదారుల అభిరుచుల్లో మార్పులు ఎలక్ట్రిక్ బైక్‌లకు డిమాండ్‌ను పెంచుతున్నాయని పేర్కొన్నారు.

