పొటాష్ కొంటే.. మటాషేనా..!?!
నల్లబెల్లి గ్రోమోర్ సెంటర్లో పొటాష్ ఎరువు నాణ్యతపై రైతుల ఆందోళన
పొటాష్ బస్తాలో మట్టి కనిపించడంతో కంగుతిన్న రైతు
294 బస్తాల స్టాక్ రాగా.. ఇప్పటికే 150 వరకు విక్రయం
నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపిస్తాం
నివేదిక ఆధారంగా చర్యలు: వ్యవసాయ అధికారి బన్న రజిత
కాకతీయ, నల్లబెల్లి : పంటకు అధిక దిగుబడి రావాలని ఆశించి ఎరువు కొనుగోలు చేసిన రైతుకు.. బస్తా తెరిచేసరికి పొటాష్‌కు బదులు మట్టి కనిపించడంతో షాక్ తగిలింది. నల్లబెల్లి మండల కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్లో కొనుగోలు చేసిన పొటాష్ బస్తాలో మట్టి కలిసిన పదార్థం కనిపించడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. పంటలకు వేసే ఎరువులో నాణ్యత లోపం ఉంటే దిగుబడిపై ప్రభావం పడే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు బస్తాలో ఉన్నది పొటాష్ ఎరువేనా? నాణ్యతా లోపమా? కల్తీ పదార్థమా? అన్నది అధికారుల పరీక్షల్లో తేలాల్సి ఉంది. మండలంలోని కొండాయిల్పల్లికి చెందిన రైతు కొనకటి రాజు గ్రోమోర్ సెంటర్లో ఒక్కొక్కటి రూ.2,200 చొప్పున 3 పొటాష్ బస్తాలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. పంటకు ఎరువు వేసే సమయంలో ఒక బస్తాను తెరిచి చూడగా అందులో పొటాష్‌కు బదులుగా మట్టి కలిసినట్లు కనిపించిందని పేర్కొన్నారు. దీంతో అనుమానం వచ్చి మిగిలిన 2 బస్తాలను కూడా పరిశీలించగా వాటిలోనూ అదే తరహా పదార్థం కనిపించిందని చెప్పారు. వెంటనే ఈ విషయాన్ని గ్రోమోర్ సెంటర్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రైతు నమ్మకంతో కొనుగోలు చేసిన ఎరువు బస్తాలోనే నాణ్యతపై అనుమానం తలెత్తితే.. పంటను నమ్ముకుని బతికే రైతు పరిస్థితి ఏమిటి? అని రైతులు ప్రశ్నిస్తున్నారు.

294 బస్తాల స్టాక్.. 150 బస్తాలు విక్రయం
గ్రోమోర్ సెంటర్‌కు కోరమండల్ పొటాష్‌కు సంబంధించిన 294 బస్తాల స్టాక్ వచ్చినట్లు సమాచారం. అందులో యాప్ ద్వారా బుక్ చేసుకున్న రైతులకు ఇప్పటికే సుమారు 150 బస్తాల వరకు విక్రయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక రైతు కొనుగోలు చేసిన 3 బస్తాల్లోనూ మట్టి కనిపించడంతో.. అదే స్టాక్‌కు చెందిన మిగిలిన బస్తాల పరిస్థితిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఎరువును కొనుగోలు చేసిన రైతులు పంటలకు వినియోగించారా? వినియోగించి ఉంటే పంటలపై ప్రభావం పడిందా? అన్నదానిపై అధికారులు వెంటనే దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. బస్తాల్లో కనిపించిన పదార్థం నిజంగా మట్టేనా? ఎరువులో నాణ్యతా లోపం ఉందా? లేక కల్తీ జరిగిందా? అన్నది ప్రయోగశాల పరీక్షల్లో తేలాల్సి ఉంది. ఈ విషయంపై వ్యవసాయ అధికారి బన్న రజితను వివరణ కోరగా.. అనుమానం ఉన్న పొటాష్ బస్తాల నుంచి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపిస్తామని తెలిపారు. ప్రయోగశాల నివేదిక ఆధారంగా ఎరువులో నాణ్యతా లోపం ఉన్నట్లు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

మిగిలిన స్టాక్‌ను సీజ్ చేసి పరీక్షించాలి
ఒకే స్టాక్‌లోని 3 బస్తాల్లో నాణ్యతపై అనుమానం తలెత్తిన నేపథ్యంలో.. సంబంధిత బ్యాచ్‌కు చెందిన మిగిలిన స్టాక్‌ను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికే విక్రయించిన బస్తాల వివరాలను సేకరించి, వాటిని కొనుగోలు చేసిన రైతుల నుంచి కూడా నమూనాలు తీసుకుని పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎరువులో లోపం ఉన్నట్లు తేలితే విక్రయాన్ని నిలిపివేయడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, నష్టపోయే రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. రైతు చెమటతో పండే పంటకు మట్టి ఎరువుగా మారకుండా అధికారులు తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది.

