జీఐఎస్‌తో ప్రతి ఆస్తి లెక్క తేల్చండి
సమగ్ర ప్రాపర్టీ సర్వేకు పకడ్బందీ కార్యాచరణ
సర్వేను పారదర్శకంగా, శాస్త్రీయంగా నిర్వహించాలి
బల్దియా కమిషనర్ టి. వెంకన్న ఆదేశం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : గ్రేటర్ వరంగల్ నగరంలోని ప్రతి ఆస్తిని జీఐఎస్ విధానంలో లెక్క తేల్చేందుకు పకడ్బందీ కార్యాచరణ రూపొందించాలని బల్దియా కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు. శనివారం కమిషనర్ క్యాంపు కార్యాలయంలో జీఐఎస్ టెక్నికల్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి ఆస్తిపన్ను సర్వే విధివిధానాలు, సాంకేతిక అంశాలు, డేటా సేకరణ, భవిష్యత్ వినియోగంపై చర్చించారు. నగరంలోని ఆస్తులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని శాస్త్రీయంగా నమోదు చేసేలా ప్రణాళిక రూపొందించాలని వెంకన్న సూచించారు. ఇందుకోసం ఎన్‌ఐటీకి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు, కుడా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, సూపరింటెండెంట్ ఇంజినీర్, సిటీ ప్లానర్, డిప్యూటీ కమిషనర్‌లతో సాంకేతిక కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమిటీ సూచనలు, సాంకేతిక అవసరాలు, నగర భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఆర్‌ఎఫ్‌పీని సమగ్రంగా రూపొందించాలని ఆదేశించారు. సర్వే పారదర్శకంగా, శాస్త్రీయంగా, సమర్థవంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ రాజ్‌కుమార్, సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి, ఐటీ మేనేజర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

