ఆశ్రమ పాఠశాలలో ఆగని అలజడి
గిరిజన బాలికల హాస్టళ్లలో ఏం జరుగుతోంది..?
కరువవుతున్న భద్రత.. పర్యవేక్షణ గాలికి
స్టడీ అవర్స్‌లో కర్రతో కొట్టిన లీడర్ విద్యార్ది.. ముగ్గురికి అస్వస్థత
అర్ధరాత్రి విద్యార్థుల ఫోన్‌తో వెలుగులోకి ఘటన
వార్డెన్ తీరు పై తల్లిదండ్రుల ఆగ్రహం
వరుస ఘటనలతో హాస్టళ్ల నిర్వహణపై ప్రశ్నలు
పర్యవేక్షణ లోపాలతోనే ఘటనలు పునరావృతం
బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలంటున్న తల్లిదండ్రులు
కాకతీయ, ఏటూరునాగారం: గిరిజన బాలికలకు రక్షణగా నిలవాల్సిన ఆశ్రమ పాఠశాలలో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థినుల పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించాల్సిన సమయంలో వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో ఆదివారం రాత్రి ఏటూరునాగారం మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల హాస్టల్లో ఘటన చోటుచేసుకుంది. స్టడీ అవర్స్‌లో చదవడం లేదంటూ 9వ తరగతికి చెందిన లీడర్ విద్యార్థిని ముగ్గురు విద్యార్థినులను కర్రతో కొట్టింది. దీంతో 6వ తరగతికి చెందిన ఒకరు, 7వ తరగతికి చెందిన ఇద్దరు విద్యార్థినులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భయానికి గురైన విద్యార్థినులు తీవ్రంగా ఏడవడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ముగ్గురినీ ఏటూరునాగారం సామాజిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

వార్డెన్ ముందే వెళ్లడంతో..
ఘటన జరిగిన సమయంలో హాస్టల్ వార్డెన్ లింగయ్య అందుబాటులో లేకపోవడంపై విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్ తన విధులు ముగియడానికి సుమారు అరగంట ముందే హాస్టల్ నుంచి వెళ్లిపోయి, విద్యార్థినుల బాధ్యతలను నైట్ వాచ్‌మెన్‌కు అప్పగించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. అదే సమయంలో హాస్టల్లో స్టడీ అవర్స్ కొనసాగుతున్నాయి. ముగ్గురు విద్యార్థినులను కర్రతో కొడుతున్న సమయంలో నైట్ వాచ్మెన్ అడ్డుకోలేదని బాధిత విద్యార్థినులు తల్లిదండ్రులకు తెలిపారు. విద్యార్థినుల భద్రత, పర్యవేక్షణ బాధ్యతలు ఉన్న సమయంలో వార్డెన్ అందుబాటులో లేకపోవడం, బాధ్యతలను వాచ్‌మెన్‌కు అప్పగించి వెళ్లడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అర్ధరాత్రి తల్లిదండ్రులకు విద్యార్థుల ఫోన్
ముగ్గురు విద్యార్థినులను కర్రతో కొట్టిన ఘటనపై హాస్టల్ నిర్వాహకుల నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని తల్లిదండ్రులు తెలిపారు. రాత్రి 1–2 గంటల సమయంలో తోటి విద్యార్థినులు వేరే వ్యక్తి ఫోన్ ద్వారా విషయం తెలియజేయడంతోనే ఘటన తమ దృష్టికి వచ్చిందన్నారు. దీంతో సోమవారం ఉదయం తల్లిదండ్రులు హుటాహుటిన హాస్టల్‌కు చేరుకుని తమ పిల్లల పరిస్థితిని తెలుసుకున్నారు. ఘటనపై తల్లిదండ్రులు ప్రశ్నించడంతో భయాందోళనకు గురైన లీడర్ విద్యార్థిని తన మణికట్టును చాకుతో కోసుకుంది. దీంతో అక్కడ కొద్దిసేపు ఆందోళనకర పరిస్థితి నెలకొంది. తమ పిల్లలపై జరిగిన ఘటన గురించి సకాలంలో సమాచారం ఇవ్వకపోవడం, హాస్టల్ నిర్వహణ, వార్డెన్ తీరుపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరుస ఘటనలతో హాస్టళ్లపై ప్రశ్నలు
ఇదిలా ఉండగా.. ఈ నెల 7న ఏటూరునాగారం మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో తాగునీరు, పారిశుధ్యం, మరుగుదొడ్ల సమస్యలపై విద్యార్థినులు ఆందోళనకు దిగారు. సమస్యలను ప్రశ్నిస్తే వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టి ప్రిన్సిపల్ కిరణ్మయిని మహబూబాబాద్ గురుకుల కళాశాలకు, మ్యాథ్స్ లెక్చరర్ తిరుపతమ్మను ఆసిఫాబాద్ జిల్లా జైనూరు గురుకుల కళాశాలకు బదిలీ చేయగా, కామర్స్ లెక్చరర్ అనితకు ప్రిన్సిపల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల హాస్టల్లో ముగ్గురు విద్యార్థినులను లీడర్ విద్యార్థిని కర్రతో కొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. రెండు ఘటనలు వేర్వేరు హాస్టళ్లలో జరిగినప్పటికీ, వరుసగా సమస్యలు వెలుగులోకి రావడం హాస్టళ్లలో పర్యవేక్షణ తీరును ప్రశ్నార్థకం చేస్తోంది. విద్యార్థినుల భద్రతను పర్యవేక్షించాల్సిన సిబ్బంది అందుబాటులో లేకపోవడం, బాధ్యతలను ఇతర సిబ్బందికి అప్పగించడం వంటి పరిస్థితులు పర్యవేక్షణ లోపాలను ఎత్తిచూపుతున్నాయి. పర్యవేక్షణ కరువుతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాలికల హాస్టళ్లలో నిరంతర పర్యవేక్షణతో పాటు విద్యార్థినుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

