నిండు కుండలా చెరువులు
పరవళ్లు తొక్కుతున్న మత్తళ్లు
కాకతీయ, పెద్దవంగర : ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పెద్దవంగర మండలంలో ఉన్న చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. వరద నీటితో చెరువులు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. దీంతో కొన్ని చెరువులు తప్ప మిగిలిన చెరువులు నిండు కుండలా తలపిస్తున్నాయి. మరికొన్ని చెరువులు అలుగులు పారుతున్నాయి. కొరిపెల్లి, వడ్డే కొత్తపల్లి, పెద్దవంగర, చిట్యాల చెరువులు నిండి కలుజులు ప్రవహిస్తున్నాయి. దీంతో ఖరీఫ్ వరి సాగుకు ఢోకా వుండదని ఆయకట్టు రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అంతకు ముందు ఆగస్టు నెలలో రెండు మూడు రోజుల పాటు వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో చెరువుల్లో అంతంతమాత్రంగానే నీరు వుంది. దీంతో వరి సాగు చేసే ఆయకట్టు రైతులు ఆందోళన చెందారు. ఇటువంటి తరుణంలో భారీ వర్షాలు కురిసి, చెరువులు నిండాయి. ప్రస్తుతం మండలంలో ఎక్కడ చూసినా సాగునీటి చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. దాదాపు అన్ని చెరువులు నిండిపోయి అలుగులు (పొర్లుకట్ట) పారుతున్నాయి. దీనివల్ల ఖరీఫ్ వరిసాగుకు నీటి కొరత వుండదని, అంతేకాక భూగర్భ జలాలు బాగా వృద్ధి చెందుతాయని రైతులు చెబుతున్నారు. పెద్ద చెరువులు, ఆవలు వున్న ప్రాంతాల్లో రబీ పంటకు కూడా నీరు అందుబాటులో వుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.అలాగే మండల పరిధిలోని వడ్డే కొత్తపల్లి గ్రామంలోని ఆయుర్వేద దవాఖానలో మోకాళ్ల లోతు వర్షపు నీరు చేరాయి. దాంతో సామాగ్రి తడసి ముద్దాయ్యాయి.

