అధికారులు అప్రమత్తంగా ఉండాలి
వర్షంలో నిమజ్జన ఏర్పాట్లపై సీపీ, కమిషనర్ ప్రత్యేక పర్యవేక్షణ
చిన్నవడ్డేపల్లి చెరువులో క్షేత్రస్థాయి పరిశీలన
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వర్షం కురుస్తున్న నేపథ్యంలో గణేశ్ నిమజ్జన ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ సీపీ శ్వేత, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న ఆదేశించారు. గురువారం ఉదయం నగరంలోని చిన్నవడ్డేపల్లి చెరువు వద్ద కొనసాగుతున్న నిమజ్జన ఏర్పాట్లను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిమజ్జనం జరుగుతున్న తీరు, భక్తుల రాకపోకలు, భద్రత, పారిశుద్ధ్య ఏర్పాట్లను పరిశీలించి అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు నిమజ్జనమైన విగ్రహాల సంఖ్య, ఇంకా చేయాల్సిన వాటి వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వర్షం నేపథ్యంలో ఉత్సవ కమిటీలు తమ విగ్రహాలను సాధ్యమైనంత త్వరగా నిమజ్జన కేంద్రాలకు తీసుకువచ్చి నిమజ్జనం పూర్తి చేసుకునేలా సూచించాలని అధికారులను ఆదేశించారు. భక్తులు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీస్, మున్సిపల్, ఇరిగేషన్, వైద్య ఆరోగ్య, రెవెన్యూ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా పూర్తయ్యేలా చూడాలని కోరారు.
నిమజ్జనం పూర్తైన వెంటనే విగ్రహాల అవశేషాలు, వ్యర్థాలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని కమిషనర్ వెంకన్న ఆదేశించారు. పరిశీలనలో జీడబ్ల్యూఎంసీ ఎస్ఈ రాజ్ కుమార్, ఎంహెచ్ వో డాక్టర్ రాజేష్, ఇరిగేషన్ ఈఈ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

