ఎమ్మెల్సీ గెలుపునకు నడుం బిగించాలి
ఖమ్మం నుంచి అత్యధిక ఓట్లు నమోదు చేయించాలి
మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
కాకతీయ, ఖమ్మం : రాబోయే ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి పార్టీ శ్రేణులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని మాజీ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. ఖమ్మం నియోజకవర్గం నుంచి అత్యధికంగా పట్టభద్రుల ఓట్లు నమోదు చేయించి పార్టీ అభ్యర్థి విజయానికి బాటలు వేయాలని సూచించారు. ఈ సందర్భంగా తన గ్రాడ్యుయేట్ ఓటును స్వయంగా నమోదు చేసుకున్నారు. ఖమ్మంలో నిర్వహించిన పార్టీ సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రస్తుతం 28,500 గ్రాడ్యుయేట్ ఓట్లు ఉన్నాయని తెలిపారు. ప్రతి 100 ఓట్లకు ఒక సమన్వయకర్త చొప్పున 325 మందికి అదనంగా బాధ్యతలు అప్పగించామని చెప్పారు. గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే తరహాలో ప్రతి ఇంటికీ వెళ్లి అర్హులైన పట్టభద్రుల వివరాలను సేకరించాలని సూచించారు.
నమోదు కేంద్రాలతో విస్తృత ప్రచారం
డివిజన్ల వారీగా టెంట్లు, గుడారాలు, పార్టీ కార్యాలయాల వద్ద నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసి ఓటర్ల నమోదు ప్రక్రియను ఉధృతం చేస్తున్నామని అజయ్‌కుమార్ తెలిపారు. తాను వచ్చే నెల రోజుల్లో వారానికి కనీసం 2 రోజులు ఈ కార్యక్రమాల్లో నేరుగా పాల్గొంటానన్నారు. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, వైద్యులు, న్యాయవాదులు, బ్యాంకింగ్ రంగ ఉద్యోగులు, డిగ్రీ పూర్తి చేసి 3 ఏళ్లు పూర్తయిన ప్రైవేట్ సంస్థల ఉద్యోగులను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించాలని సూచించారు.
గత విజయాన్ని పునరావృతం చేయాలి
గతంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా, ముఖ్యంగా ఖమ్మం నియోజకవర్గం నుంచి అత్యధికంగా గ్రాడ్యుయేట్ ఓట్లు నమోదు చేయించి విజయంలో కీలక పాత్ర పోషించామని అజయ్‌కుమార్ గుర్తుచేశారు. అదే ఉత్సాహంతో ఈసారి కూడా పనిచేయాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోయే కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికలకు నాంది అని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం రాష్ట్రంలో సరికొత్త రాజకీయ ట్రెండ్‌కు శ్రీకారం చుడుతుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఆర్జేసీ కృష్ణ, బచ్చు విజయ్‌కుమార్, పగడాల నాగరాజు, ఖమర్, మాజీ కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, షేక్ మక్బుల్, శీలంశెట్టి వీరభద్రం, నాగండ్ల కోటేశ్వరరావు, జ్యోతి రెడ్డి, పల్లా రోజ్లీనా, కమల, బుడిగం శ్రీను, బుర్రి వెంకటేశ్వర్లు, బిక్కసాని ప్రశాంతిజస్వంత్, పసుమర్తి రామ్మోహన్, తోట రామారావు, మాటేటి నాగేశ్వరరావు, నాయకులు మెంతుల శ్రీశైలం, కొత్త వెంకటేశ్వరరావు పాషా, బత్తుల మురళి, వీరు నాయక్, పిన్ని కోటేశ్వరరావు, గుత్తా రవి, మద్దినేని వెంకటరమణ, కొంటెముక్కల వెంకటేశ్వర్లు, మెంటం రామారావు, ప్రదీప్, సర్పంచ్‌లు, పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

