పారిశుద్ధ్య కార్మికుల భద్రతకు ప్రాధాన్యం
జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్‌పాయ్
యూనిఫాం, యాప్రాన్లు, బూట్లు, గ్లౌజుల పంపిణీ
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : పారిశుద్ధ్య కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. గురువారం గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ టి. వెంకన్నతో కలిసి పారిశుద్ధ్య కార్మికులకు యూనిఫారాలు, యాప్రాన్లు, బూట్లు, గ్లౌజులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రతి కార్మికుడు తప్పనిసరిగా యూనిఫాం, యాప్రాన్ ధరించాలని, బూట్లు, గ్లౌజులు ఉపయోగించాలని ఆదేశించారు. కార్మికుల ఆరోగ్యం, వ్యక్తిగత భద్రతను కాపాడటంలో రక్షణ పరికరాలు కీలకమని, వాటిని నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వినియోగించాలని సూచించారు. కమిషనర్ వెంకన్న మాట్లాడుతూ పారిశుద్ధ్య పనులు చేపట్టే సమయంలో భద్రతా ప్రమాణాలను పాటించాలని, రక్షణ పరికరాలు లేకుండా విధుల్లోకి రావొద్దని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, శానిటరీ సూపర్వైజర్లు గోల్కొండ శ్రీను, భాస్కర్, శ్యామ్‌రాజ్, అనిల్‌కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, కార్మికులు పాల్గొన్నారు.

