అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు
పర్యాటక ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యం
ప్రతి 15 రోజులకు పనుల పురోగతిపై సమీక్ష
ములుగు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆదేశం
కాకతీయ, ములుగు : జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో అభివృద్ధి పనులపై సమీక్షించారు. రామప్ప ఐలాండ్, పర్యావరణ ఉద్యానవనం, ప్లాజా, ఎకో టూరిజం విలేజ్, బటర్‌ఫ్లై గార్డెన్, పర్యాటక సమాచార కేంద్రం పనులను వేగవంతం చేయాలని సూచించారు. జంపన్నవాగు అభివృద్ధి, పుష్కరాల పనులకు అంచనాలు సిద్ధం చేసి, టెండర్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. యంగ్ ఇండియా పాఠశాల, వైద్య కళాశాల నిర్మాణాలపైనా సమీక్షించారు. సమీక్షలో ఫోన్ ద్వారా మాట్లాడిన రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క.. మేడారం జాతరను దృష్టిలో ఉంచుకొని పెండింగ్ రహదారి పనులు వేగవంతం చేయాలని, నూతన అతిథిగృహ నిర్మాణం ప్రారంభించాలని సూచించారు. మల్లూరు ఆలయం వద్ద వసతులు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామపంచాయతీ, గ్రామ సమాఖ్య భవనాలు, గిరిజన ప్రాంతాల రహదారుల పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంపత్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, అధికారులు పాల్గొన్నారు.

