భూసార పరిరక్షణకు ‘ఖేత్ బచావో అభియాన్’
నేల తల్లిని కాపాడితేనే భవిష్యత్ తరాలకు ఆహార భద్రత!
రసాయనాల వినియోగం.. శాస్త్రీయ పద్ధతుల్లోనే ఉండాలి
వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
కాకతీయ, హైదరాబాద్: నేల తల్లిని సంరక్షించుకుంటేనే భవిష్యత్ తరాలకు ఆహార భద్రత కల్పించగలమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భూసార పరిరక్షణ, సుస్థిర వ్యవసాయమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమాన్ని గురువారం రైతు నేస్తం కార్యక్రమంలో ఆయన ప్రారంభించారు. భూసార పరీక్షలు చేయించుకొని, నేలలోని పోషకాల ఆధారంగా ఎరువులు వినియోగించాలని సూచించారు. రసాయన ఎరువులు, పురుగుమందులను వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన మోతాదుల్లోనే వాడాలని, అధిక వినియోగంతో నేల ఆరోగ్యం, పర్యావరణం దెబ్బతింటాయని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావం, వాతావరణ మార్పులు, అసమాన వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకొని పంటల ఎంపికలో ముందస్తు ప్రణాళిక అవసరమన్నారు. నీటి లభ్యతను బట్టి స్వల్పకాలిక పంటలు, అపరాలు సాగు చేయాలని, సూక్ష్మ సేద్య పద్ధతులను ప్రోత్సహించాలని సూచించారు. సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయం, పంట మార్పిడి, జీవ ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పంట వ్యర్థాలను కాల్చకుండా మల్చింగ్కు వినియోగించాలని, వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించుకోవాలని తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా అర్హులైన రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు వ్యవసాయ పనిముట్లు అందిస్తామని వెల్లడించారు. ‘ఖేత్ బచావో అభియాన్’ను నిరంతర ఉద్యమంగా చేపట్టి, నేల సారం, నీటి వనరులను కాపాడాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.

