ఎన్యూమరేటర్ల నియామకం పూర్తి చేయాలి
జనగణన వివరాల సేకరణలో ఖచ్చితత్వం పాటించాలి
800 మందికి మించిన జనాభా ఉన్నచోట కొత్త గణన బ్లాక్
కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం
కాకతీయ, సిరిసిల్ల : భారత జనగణన–2027లో భాగంగా రెండో దశ జనాభా గణన వివరాలను క్షేత్రస్థాయిలో నాణ్యతతో, కచ్చితత్వంతో సేకరించాలని జిల్లా ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్, కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఛార్జ్ ఆఫీసర్లు, అదనపు ఛార్జ్ ఆఫీసర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో గణన ప్రక్రియ, సిబ్బంది విధులు, సమాచార నమోదు, ప్రభుత్వ మార్గదర్శకాలపై అవగాహన కల్పించారు. ఎన్యూమరేటర్ల నియామకాన్ని పూర్తి చేయాలని, గ్రామపంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారుల నుంచి వివరాలు సేకరించి గృహాల జాబితా బ్లాక్లను నవీకరించాలని కలెక్టర్ సూచించారు. 800 మందికి మించిన జనాభా ఉన్న ప్రాంతాల్లో కొత్త గణన బ్లాక్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. జనగణన జాతీయ ప్రాధాన్య కార్యక్రమమని, ప్రతి కుటుంబం, వ్యక్తికి సంబంధించిన 40 ప్రశ్నల వివరాలను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నమోదు చేయాలని పేర్కొన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి రెండో దశను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా జనగణన అధికారి, ముఖ్య ప్రణాళిక అధికారి సంపత్ కుమార్, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి వీరభద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

